Mobile Popup Ad
Mobile Popup Ad

విషాదం.. లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడి దుర్మరణం

కలం, జనగామ : జనగామ (Jangaon )మండలం పరిధిలోని చంపక హిల్స్ సమీపంలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా విషాదాన్ని నింపింది. వేగంగా వెళ్తున్న లారీ ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు బచ్చన్నపేట మండలం బసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ (35)గా గుర్తించారు. వెంకటేష్ తన పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చంపక హిల్స్ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో యువకుడు రోడ్డుపైనే కుప్పకూలి మృతి చెందాడు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదంలో ధ్వంసమైన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని ట్రాఫిక్‌ను సర్దుబాటు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారైనట్లు తెలుస్తుండగా.. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ ఘటనతో కొంతసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. స్థానికులు మాత్రం ఆ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు వేగ నియంత్రణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>