కలం, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వంపై వివిధ సెక్షన్ల ప్రజలు అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రభుత్వ ఉద్యోగులు, ఇటు విద్యుత్ ఆర్టిజన్ వర్కర్స్, ఇంకోవైపు ఆర్టీసీ కార్మికులు.. ఇలా అన్ని వైపుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్నది. దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న డిమాండ్ల సాధన కోసం నిరసనలు, ఆందోళనకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే మూడు రోజులుగా విద్యుత్ ఆర్టిజన్ వర్కర్లు నిరవధిక సమ్మె చేస్తున్నారు. దీనికి తోడు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతుండగా డీఏ ప్రకటించి శాంతింపచేశారు రవాణా మంత్రి. తాజాగా ఉద్యోగ సంఘాల జేఏసీ (Telangana Employees Union) ఈ నెల 17 నుంచి ఆందోళనలు నిర్వహించాలని తీర్మానించింది. అందులో ఫస్ట్ స్టెప్‌గా ఈ నెల 17న సచివాలయం సహా అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ‘లంచ్ అవర్ ప్రదర్శనలు’ నిర్వహించాలని తీర్మానించింది. మొత్తం 68 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది.
చీఫ్ సెక్రటరీకి డిమాండ్ల మెమొరాండం :
తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్స్ తదితర మొత్తం 206 సంఘాలతో ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC) ఈ నెల 7న స్టేట్ ఈసీ సమావేశాన్ని నిర్వహించింది. దీర్ఘకాలంగా పేరుకుపోయిన, పరిష్కారానికి నోచుకోని సమస్యలన్నింటిపై లోతుగా చర్చించింది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా వాటిని కొలిక్కి తేవాలని నిర్ణయించి,ది. పోరాటం ద్వారానే పరిష్కారం సాధ్యమని భావించింది. రాష్ట్రంలో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు (పెన్షనర్లు) సహా మొత్తం సుమారు 15.31 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, మొత్తం 68 డిమాండ్లకు పరిష్కారం దొరకాల్సి ఉన్నదని ఈ సమావేశం తేల్చింది. చీఫ్ సెక్రటరీకి సమర్పించాల్సిన డిమాండ్ల చార్టర్ మెమొరాండంలో తక్షణం పరిష్కరించాల్సిన నాలుగు డిమాండ్లను పేర్కొన్నది.
దశలవారీగా ఉద్యమ కార్యాచరణ ఖరారు :
డిమాండ్లను పరిష్కరించుకోడానికి దశలవారీ ఉద్యమాన్ని నిర్వహించాలని జేఏసీ (Telangana Employees Union) నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగా తొలుత పోరాట రూపాన్ని ‘లంచ్ అవర్ డిమాన్‌స్ట్రేషన్’గా ఫైనల్ చేసింది. ఆ రోజు విధులకు హాజరై మధ్యాహ్న భోజన సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శనలను ఎక్కడికక్కడ నిర్వహించాలని డిసైడ్ చేసింది. సచివాలయం మొదలు హెచ్ఓడీలు, కలెక్టర్ ఆఫీసులు, జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాల వరకు ఈ ప్రదర్శన ఉంటుందని చీఫ్ సెక్రటరీకి సమర్పించే మెమొరాండంలో జేఏసీ స్పష్టం చేసింది. దీర్ఘకాల సమస్యల పరిష్కారానికి దశలవారీగానే ఉద్యమం నిర్వహించాలన్న నిర్ణయాన్ని స్పష్టం చేసింది. జేఏసీ రాష్ట్రస్థాయి ఎగ్జిక్యూటివ్ కమిటీ లోతుగా చర్చించి తీర్మానాన్ని ఆమోదించిన అంశాన్ని కూడా గుర్తుచేసింది. రాష్ట్రంలోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల మొదలు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులంతా ఇందులో పాల్గొంటారని తెలిపింది.
జూన్ 2 నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాలి :
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తెలంగాణ సెకండ్ పీఆర్సీని అమలు చేయాల్సి ఉందని ప్రభుత్వానికి గుర్తుచేసిన జేఏసీ జూన్ 2వ తేదీ నుంచి కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. గత ప్రభుత్వంలో 2023 అక్టోబరు 2న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ శివశంకర్ అధ్యక్షతన పీఆర్సీ ఏర్పాటైందని, ఆరు నెలల్లో నివేదిక సమర్పించాల్సిందిగా నిబంధన ఉన్నదని, కానీ ఇప్పటికి రెండున్నరేండ్లు దాటినా రిపోర్టు అతీగతి లేదని గుర్తుచేసింది. పీఆర్సీ ఏర్పాటై 30 నెలలైందని, ఇప్పటికే 24 నెలల సమయాన్ని కోల్పోయాయని గుర్తుచేసింది. ఇక ఎంతమాత్రం జాప్యానికి తావు లేకుండా పీఆర్సీ చైర్మన్ నుంచి వెంటనే నివేదిక తెప్పించుకుని జూన్ 2 నుంచి అమలు చేయాలని డిమాండ్ చేసింది. పెండింగ్‌లో ఉన్న డీఏలన్నింటినీ క్లియర్ చేయాలని స్పష్టం చేసింది. నిత్యావసర వస్తవుల ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం తదితరాల కారణంగా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నది.
వన్ టైమ్ రిలీజ్‌గా రూ. 13 వేల కోట్లు ఇవ్వాలి :
ప్రతి నెలా సగటున 600 మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారని, వారికి ప్రభుత్వం క్లియర్ చేయాల్సిన గ్రాట్యుటీ, జీపీఎఫ్, పెన్షన్ తదితర అనేక రకాల సెటిల్‌మెంట్స్ పేమెంట్స్ జరగడంలేదని జేఏసీ పేర్కొన్నది. ప్రతి నెలా రూ. 700 కోట్ల చొప్పున ప్రభుత్వం ఇస్తున్నా అవి సరిపోవడంలేదని, వన్‌టైమ్ క్లియరెన్సుగా రూ. 13 వేల కోట్లను ఇవ్వాలని స్పష్టం చేసింది. సకాలంలో ప్రభుత్వం నుంచి విడుదల కాకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు వారి పిల్లల చదువు, పెళ్ళిళ్లు, హౌజింగ్ ఈఎంఐ, వైద్య ఖర్చులు తదితరాలకు ఇబ్బంది పడుతున్నారని వివరించింది. ఉద్యోగులకు హెల్త్ కార్డ్ సిస్టమ్ కోసం క్యాబినెట్ సబ్ కమిటీ చర్చించినా ఇప్పటికీ మార్గదర్శకాలు తయారుకాలేదని, మే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం పాజిటివ్ నిర్ణయం తీసుకోవాలని జేఏసీ డిమాండ్ చేసింది. గతంలో ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ అమలయ్యేదని, ఇటీవల కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమలవుతున్నదని, 2004 సెప్టెంబరు 1వ తేదీకి ముందు నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులందరికీ ఓపీఎస్ అమలు చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది.
Read Also: యుద్ధం మళ్లీ షురూ..?.. ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
Follow US on: WhatsApp

