కలం, నిజామాబాద్ బ్యూరో : నవీపేట (Navipet) పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్, మెకానికల్ విభాగాలు కొనసాగుతున్నాయని, వచ్చే విద్యా సంవత్సరం నుండి రోబోటిక్స్, కంప్యూటర్ సైన్స్ కోర్సులు సైతం అందుబాటులోకి రానున్నాయని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి (P.Sudarshan Reddy) తెలిపారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఊతమందించే పాలిటెక్నిక్ కళాశాలను విద్యార్థిని, విద్యార్థులు, యువత పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి బుధవారం ఆయన నవీపేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. అందుబాటులో ఉన్న సదుపాయాలు, బోధన, బోధనేతర సిబ్బంది గురించి అడిగి తెలుసుకున్నారు. యువతకు తక్షణ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాలనే ఉద్దేశ్యంతో జిల్లాలో విరివిగా పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు.
అయితే విద్యార్థులు తగిన విధంగా ప్రవేశాలు పొందడం లేదని, ఈ కళాశాల గురించి విస్తృత స్థాయిలో అవగాహన పెంపొందించాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గడిచిన నాలుగు సంవత్సరాల నుండి పాలిటెక్నిక్ కోర్సులు చేసిన విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని గుర్తు చేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేఖరులతో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, వేసవిలో జిల్లాలో ఎక్కడ కూడా నీటి ఎద్దడి తలెత్తకుండా, ప్రజల అవసరాలకు సరిపడా శుద్ధి జలాలు సరఫరా జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను సన్నద్ధం చేశామని అన్నారు. ప్రజలు కూడా సకాలంలో మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు పన్నులు చెల్లిస్తూ సదుపాయాలను మెరుగుపర్చేందుకు సహకరించాలని కోరారు.
ప్రజల ఆరోగ్యాల పరిరక్షణకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నామని, కల్తీ ఆహార పదార్థాల తయారీ, విక్రయాలపై నిఘా ఉంచాలని సంబంధిత శాఖలకు సూచించామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు వీలుగా లబ్దిదారులకు అవసరమైన తోడ్పాటును అందిస్తున్నామని, ఇసుక, మొరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు కలిపి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రభుత్వం కేటాయించినందున, అనువైన స్థలం కోసం పరిశీలన చేస్తున్నామన్నారు. ఈ ప్రాంత రైతాంగ ప్రయోజనాల కోసం సాధ్యమైనంత త్వరగా ఫ్యాక్టరీ ఏర్పాటయ్యేలా కృషి చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ సలహాదారు వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్, సందీప్ తదితరులు ఉన్నారు.

