epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ ముఖచిత్రం

కలం డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ విజన్ గ్లోబల్ సమ్మిట్’ (Telangana Global Summit)లో రెండేండ్ల ప్రజా ప్రభుత్వంలో సాధించిన విజయాలతో పాటు భవిష్యత్తు అభివృద్ధి, నిర్మాణంపైనా స్పష్టత ఇవ్వనున్నది. ఇందుకోసం కేవలం డయాస్‌పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మాత్రమే కాక వివిధ రంగాల్లో సాధించిన ప్రగతితో పాటు ఫ్యూచర్‌లో రాష్ట్ర ముఖచిత్రం ఎలా మారనున్నదో స్టాళ్ళ ద్వారా వివరించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండు భారీ హాళ్ళను నిర్మిస్తున్న ప్రభుత్వం అందులో ఒక్కో రంగానికి సంబంధించిన స్టాళ్ళ కేటాయింపుపై లే-ఔట్ ప్లాన్‌ను ఖరారు చేసింది. దాదాపు ఇరవై అంశాలను ఎంపిక చేసి వాటిని వివరించేందుకు వేర్వేరు స్టాళ్ళ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఈ హాల్ మధ్యలో 8 మీటర్ల వ్యాసంతో కూడిన ఎత్తయిన డోమ్‌ను కూడా గ్లోబల్ సమ్మిట్‌కు గుర్తుగా నిర్మిస్తున్నది.

ప్రత్యేక ఆకర్షణగా ఫ్యూచర్ సిటీ స్టాల్ :

గ్లోబల్ సమ్మిట్‌లో(Telangana Global Summit) రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీ (Bharat Future City) కీలకం కానున్నది. దీని ఉద్దేశం, ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో చోటుచేసుకోనున్న అభివృద్ధి, పరిశ్రమల స్థాపన, వాటి ద్వారా లభించనున్న ఉపాధి, వివిధ రూపాల్లో రాష్ట్రంలో జరగనున్న డెవలప్‌మెంట్, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తలసరి ఆదాయం పెరగడానికి దారితీసే అంశాలు, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి తోడ్పడే వ్యూహం.. ఇలాంటివన్నీ ఈ హాల్‌లోని స్టాళ్ళ ద్వారా ఇన్వెస్టర్లు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు సులభంగా తెలుసుకునేలా రూపొందుతున్నాయి. ఫ్యూచర్ సిటీ స్టాల్ 14 మీటర్ల వెడల్పు, 21 మీటర్ల పొడవుతో రూపుదిద్దుకోనున్నది. ఇంతే విస్తీర్ణంలో ఎంఆర్‌డీసీ స్టాల్, 40 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పుతో ‘నెట్ జీరో’ (Net Zero) స్టాల్, ఇంతే విస్తీర్ణంలో డిఫెన్స్/ఎయిర్‌స్పేస్ ఇండస్ట్రీకి సంబంధించిన స్టాల్ రూపుదిద్దుకున్నాయి.

రెండేండ్ల సంక్షేమంపై స్పెషల్ ఫోకస్ :

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేండ్లలో సాధించిన ప్రగతి, ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా అందించిన లబ్ధిని ప్రత్యేక స్టాళ్ళ ద్వారా తెలుసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు జరిగాయి. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ చీరలు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, స్వయం సహాయక సంఘాలకు చేయూత, మహాలక్ష్మి (ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం), రైతు రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా, రాజీవ్ యువ వికాసం తదితర అంశాలను స్టాళ్ళు వివరించనున్నాయి. ఇక యంగ్ ఇండియా, భూభారతి, ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన తదితరాల కోసం విడిగా స్టాళ్ళు ఏర్పాటయ్యాయి. స్కిల్ యూనివర్శిటీ, స్పోర్ట్స్ యూనివర్శిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్శిటీ, ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ… ఇలాంటి రంగాలకు చెందిన స్టాళ్ళు కూడా ఏర్పాటవుతున్నాయి.

రియల్ ఎస్టేట్, రెన్యూవబుల్ ఎనర్జీ :

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంతో పాటు భవన నిర్మాణాలు, వాటికి అనుబంధంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినవారికి లభిస్తున్న ఉపాధి తదితరాలకు సంబంధించిన స్టాళ్ళు కూడా గ్లోబల్ సమ్మటిలో భాగంగా రూపొందుతున్నాయి. క్రెడాయ్ (Credai), నరెడ్కో (Naredco), జీఎంఆర్ (GMR), ఎమ్మార్ (Emaar), హైదరాబాద్ ఐఐటీ, ట్రైఫెడ్ (Trifed), టామ్‌కామ్ (Tomcom), కల్చరల్ (Cultural), టూరిజం (Tourism) తదితర రంగాల స్టాళ్ళు కూడా రూపొందాయి. విద్య, వైద్యం, ఆరోగ్యం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, వ్యవసాయం, హార్టికల్చర్, గిరిజన సంక్షేమం (ఇందిరా గిరి వికాసం), మహిళా సంక్షేమం (మహాలక్ష్మి, గృహజ్యోతి), పౌర సరఫరాల శాఖ (అత్యధిక వరి ఉత్పత్తి), కార్మిక శాఖ (గిగ్ వర్కర్స్ పాలసీ).. ఇలాంటి అంశాలను ప్రతినిధులకు వివరించేలా స్టాళ్ళు ఏర్పాటయ్యాయి.

Read Also: రహస్య వీడియోలతో బెదిరింపులు.. పోలీసులను సైతం ట్రాప్, కిలేడీ అరెస్ట్

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>