Mobile Popup Ad
Mobile Popup Ad

గిగ్ వర్కర్స్ బిల్లుకు TGPWU స్వాగతం..కానీ సవరణలకు ప్రతిపాదన!

కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి మంత్రి మండలి సోమవారం ఆమోదించిన “తెలంగాణ ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్స్ బిల్లు, 2026″ను తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ స్వాగతించారు. ఈ సందర్భంగా లక్షలాది మంది గిగ్ కార్మికులకు (Gig Workers) సామాజిక భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని కొనియాడారు. అయితే ఈ చట్టం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలనే లక్ష్యంతో బిల్లులోని కొన్ని నిబంధనలపై మరింత స్పష్టత అవసరమంటూ కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి TGPWU కొన్ని సవరణలు ప్రతిపాదించింది.

గిగ్ వర్కర్లకు అందే వేతనాలు కనీస వేతన చట్టం-1948 కంటే తక్కువగా ఉండకూడదని TGPWU ప్రధానంగా డిమాండ్ చేసింది. ఈ మేరకు పని స్వభావం, నైపుణ్యం, ప్రాంతం ఆధారంగా వేతన వర్గీకరణ ఉండాలని.. అప్పుడే గిగ్ కార్మికులకు నిజమైన ఆర్థిక భరోసా లభిస్తుందని షేక్ సలావుద్దీన్ అన్నారు. ప్రభుత్వం ఈ సవరణలను సానుకూలంగా పరిశీలించి, కార్మికుల హక్కులను మరింత పటిష్టం చేసే విధంగా తుది చట్టాన్ని రూపొందించాలని విజ్ఞప్తి చేశారు.

బిల్లులోని సెక్షన్ 2(m)లో ఉన్న “ప్లాట్‌ఫామ్ వర్క్” నిర్వచనం గందరగోళానికి దారితీసే అవకాశం ఉన్నందున దానిని తొలగించాలన్నారు. సంక్షేమ బోర్డు నిర్మాణంలో వుమెన్ గిగ్ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం కనీసం ఒక మహిళా ప్రతినిధిని తప్పనిసరిగా నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. బోర్డు పనితీరులో పారదర్శకత కోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం కావాలని.. కనీసం 1/3 వంతు కోరం ఉండాలని ప్రతిపాదించారు. చట్టం అమల్లోకి వచ్చిన 45 రోజుల్లోగా అగ్రిగేటర్లు తమ వద్ద ఉన్న గిగ్ వర్కర్ల డేటాను బోర్డుకు సమర్పించేలా నిబంధన చేర్చాలని డిమాండ్ చేశారు. దీనివల్ల కార్మికుల నమోదు ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని స్పష్టం చేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>