కలం, తెలంగాణ బ్యూరో : కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో త్వరలో ‘సర్’ (Telangana SIR) ప్రక్రియను చేపట్టనున్నందున అన్ని రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే బూత్ లెవల్ ఆఫీసర్లు పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ చేపట్టారు. రాష్ట్రంలోని ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం సైతం ఆ కసరత్తును మొదలుపెట్టింది. ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే షెడ్యూలు రూపొందించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ప్రారంభించనున్నది. నాలుగైదు నెలల పాటు జరిగే ఈ ప్రక్రియలో చాలా మంది ఓటర్ల పేర్లు డిలీట్ అవుతాయనే ఆందోళనలు పార్టీల్లో నెలకొన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని బూత్ లెవల్ ఏజెంట్ల నియామకంపై దృష్టి పెట్టాయి. ఇప్పటికే జాబితాలో ఉన్నవారి పేర్లను తొలగించాలనుకున్నా, కొత్త ఓటర్ల పేర్లను చేర్చాలనుకున్నా ఆయా పార్టీల ఏజెంట్ల ద్వారా లోతుగా పరిశీలించి అవసరమైతే అభ్యంతరాలు లేవనెత్తాలని భావిస్తున్నాయి.
ముందే మేలుకున్న బీఆర్ఎస్ నాయకత్వం :
ఎలక్షన్ కమిషన్ (EC) నుంచి నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా వెంటనే పోలింగ్ బూత్ స్థాయిలో ఓటర్ల మార్పులు చేర్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని బీఆర్ఎస్ (BRS) భావించింది. అందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని పోలింగ్ బూత్‌ల స్థాయిలో ఏజెంట్ల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసింది. అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఇన్‌చార్జిలను పేర్లు, సంతకాలు, మొబైల్ నెంబర్లతో సహా పూర్తి వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి ఆ వివరాలను అందజేసింది. బూత్ లెవల్ ఏజెంట్ల నియామకంలో నియోజకవర్గాల ఇన్‌చార్జిలు నిర్ణయం తీసుకుంటారని ఆ లేఖలో బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సోనా భరత్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో సుమారు 36 వేల పోలింగ్ బూత్‌లు ఉన్నందున ప్రతీ బూత్‌కు ఒక ఏజెంట్‌ను అన్ని పార్టీలూ నియమిస్తాయి. ఆ బూత్ పరిధిలోని ఓటర్ల పేర్ల విషయంలో ఏజెంట్లు డేగ కన్ను వేస్తారు.
కాంగ్రెస్‌లోనూ ప్రాథమిక కసరత్తు షురూ :
పీసీసీ చీఫ్ ఇటీవల బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాలను నిర్వహించిన సందర్భంగా సర్ (SIR) గురించి ప్రస్తావించారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఒకటి కంటే ఎక్కువ బూత్‌లు ఉన్నందున కనీసం ఒక్కో సెంటర్‌కు ఒక బూత్ లెవల్ ఏజెంట్‌ను నియమించాలని కాంగ్రెస్ భావించింది. ఇటీవలే అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో జరిగిన సమావేశాల్లో బీల్ఏలను గుర్తించి వివరాలను పంపాల్సిందిగా కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం ‘సర్’కు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తుందనే క్లారిటీ లేకపోయినా ఏప్రిల్-మే నెలల్లో క్షేత్రస్థాయిలో ప్రక్రియ జరుగుతుందనే సమాచారం వచ్చింది. దీనికి తగినట్లుగా తొందరలోనే నియోజకవర్గాల ఇన్‌చార్జిల పేర్లను సీఈఓ ఆఫీస్‌కు రాష్ట్ర కాంగ్రెస్ అందజేసే అవకాశమున్నది. ‘సర్’ చేపట్టిన ఇతర రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఓటర్ల పేర్లు గల్లంతైన పరిస్థితుల్లో తెలంగాణలో అలాంటిది జరగకుండా అన్ని పార్టీల నాయకత్వం బీఎల్ఏలకు ఇప్పటికే సూచనలు ఇచ్చింది.
పార్టీలతో ముగిసిన సీఈఓ సమావేశాలు :
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే ‘సర్’ (Telangana SIR) గురించి అన్ని పార్టీల ప్రతినిధులతో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి ఇప్పటికే సమావేశాలు నిర్వహించారు. దీనికి కొనసాగింపుగా జిల్లాలవారీగా జిల్లా ఎలక్టోరల్ ఆఫీసర్లు సైతం పార్టీ లీడర్లతో మీటింగులు పెట్టారు. ప్రతీ పోలింగ్ సెంటర్‌కు కనీసంగా ఒక్కరినైనా బీఎల్ఏను నియమించాలని పార్టీల నేతలకు స్పష్టం చేశారు. మార్చి చివరికల్లా వివరాలు అందజేయాలని కోరారు. కానీ రాష్ట్ర స్థాయిలో మాత్రం బీఆర్ఎస్ మినహా మిగిలిన పార్టీలేవీ ఈ వివరాలను ఇవ్వలేదు. వారం పది రోజుల్లో అన్ని పార్టీలూ ఈ వివరాలను అందజేసే అవకాశమున్నది. కొన్ని చూట్ల బూత్ లెవల్ ఆఫీసర్ల యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్ లను స్థానికంగా ఉన్న పార్టీల లీడర్లు తీసుకుని వారంతట వారుగానే మొబైల్ యాప్‌లో కొత్త ఓటర్ల పేర్లను చేరుస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటి నేపథ్యంలో డోర్ టు డోర్ సర్వే జరిగి ఓటర్ల వివరాలను ఆధారాలతో సహా సేకరించే సమయంలో బోగస్ ఓటర్లు ఉన్నట్లయితే వారిని గుర్తించి జాబితాలో వారి పేర్లు ఎక్కకుండా లేదా లిస్టులో ఉన్నట్లయితే తొలగించడంపై పార్టీల బీఎల్ఏలు ఒత్తిడి తెచ్చే అవకాశమున్నది.
Read Also: ఆరు గ్యారంటీలు అమలైనట్లు నిరూపిస్తే ఉరేసుకుంటా : ఎమ్మెల్సీ మధుసూదనాచారి
Follow Us On : WhatsApp

