కలం, స్పోర్ట్స్ : ప్రపంచకప్ 2026లో బ్రెజిల్‌ను ఓడించి నార్వేను క్వార్టర్ ఫైనల్‌కు చేర్చిన ఎర్లింగ్ హాలాండ్ (Erling Haaland) కు భారత ఫుట్‌బాల్‌తో కూడా ఓ ఆసక్తికరమైన అనుబంధం ఉంది. 2016లో భారత్ అండర్-17 జట్టు నార్వే అండర్-17తో సన్నాహక మ్యాచ్ ఆడింది. అప్పటికి 2017 ఫిఫా అండర్-17 ప్రపంచకప్‌కు భారత్ సిద్ధమవుతోంది.
ఆ నార్వే జట్టులోనే హాలాండ్ ఉన్నాడు. ఆ మ్యాచ్ తొలి అర్ధభాగం గోల్స్ లేకుండానే ముగిసింది. 54వ నిమిషంలో భారత ఆటగాడు సంజీవ్ రెడ్ కార్డు చూడడంతో జట్టు 10 మందికి పరిమితమైంది. ఆ తర్వాత 57వ నిమిషంలో హాలాండ్ గోల్ చేశాడు. 80వ నిమిషంలో ఎరిక్ బోథైమ్ మరో గోల్ చేయడంతో నార్వే 2-0తో గెలిచింది. ఆ భారత జట్టులో సురేష్ వాంగ్జామ్ కూడా ఉన్నాడు.
2022లో హాలాండ్‌ను టాకిల్ చేస్తున్న అతని ఫొటో వైరల్ అయింది. ఆ ఫొటోపై స్పందించిన సురేష్, తాను బంతిని క్లీన్‌గా గెలుచుకున్నానని చెప్పాడు. అలాగే హాలాండ్‌ను అడ్డుకునేందుకు ప్రత్యేక ప్రణాళికతో బరిలోకి దిగినట్లు కూడా వెల్లడించాడు. ఆ భారత జట్టులోని పలువురు ఆటగాళ్లు తర్వాత సీనియర్ జట్టుకు, ఇండియన్ సూపర్ లీగ్‌లో ప్రాతినిధ్యం వహించారు.
హాలాండ్ మాత్రం ప్రపంచ ఫుట్‌బాల్‌లో సూపర్ స్టార్‌గా ఎదిగాడు. ఇప్పుడు ప్రపంచకప్‌లో బ్రెజిల్‌ను ఓడించి నార్వేను ముందుకు నడిపించిన హాలాండ్.. ఒకప్పుడు భారత అండర్-17 జట్టుకు ప్రత్యర్థిగా ఆడిన విషయం మరోసారి చర్చనీయాంశమైంది.

