కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం, నల్లవల్లి (Nallavally) గ్రామంలో వ్యవసాయ భూములను ఇండస్ట్రీయల్ పార్క్ భూసేకరణ కోసం గెజిట్ విడుదల చేయడంపై వివాదాస్పదమవుతోంది. పచ్చని పంట పొలాల సాగుకు కేరాఫ్ అయిన గ్రామంలో పరిశ్రమలు (Industrial Park) ఏర్పాటు చేయడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నర్సాపూర్ అటవీ ప్రాంతంలోని భూములను పరిశ్రమలకే కేటాయిస్తే, ఊరుకునేది లేదని రైతులు హెచ్చరిస్తున్నారు.
కూరగాయల సాగులో ఆదర్శం
నల్లవల్లి (Nallavally) కూరగాయల సాగుకు ప్రసిద్ధి. ఈ గ్రామ రైతులు కొత్త కొత్త పద్ధతులను పాటిస్తూ కూరగాయల సాగుతోపాటు ఇతర పంటలు పండిస్తారు. సాగు చేయాలే కానీ.. బంగారం లాంటి పంటలు పండుతాయి. ఇలాంటి భూములను పరిశ్రమలకు కేటాయించడంపై తీవ్ర వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి. నల్లవల్లిలో సర్వే నంబర్ 142లో గల 126.9 ఎకరాలు, సర్వే నంబర్ 160లోని 211.28 ఎకరాలు మొత్తం 337.37 ఎకరాలు భూమిని ఇండస్ట్రీయల్ పార్క్ కోసం సేకరించాలని ప్రభుత్వం ఇటీవల గెజిట్ జారీ చేసింది. దీంతో రైతుల బతుకులపై నీళ్లు చల్లినట్టయింది. ఇక్కడి గ్రామస్తులకు వ్యవసాయమే ఏకైక జీవనాధారం. ఏడాదంతా పంటలు పండిస్తూ ఆ ఆదాయంతోనే జీవనోపాధి పొందుతున్నారు.
పరిశ్రమల ఏర్పాటుతో వాయు, జల కాలుష్యం పెరిగి, ఇతర సాగు భూములు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములను కోల్పోవడంతోపాటు తమ జీవనధారం దెబ్బతినడం ఖాయమని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన గ్రామసభలోనూ ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటును వ్యతిరేకించారు. తమ భూములు ఇచ్చేది లేదని గ్రామస్తులంతా, రైతులు సంఘాలు తీర్మానం చేశాయి.
పర్యావరణానికి తీవ్ర ముప్పు
నల్లవల్లి.. సాగుకు మాత్రమే ప్రసిద్ధి కాదు.. తెలంగాణలోనే పేరుగాంచిన దట్టమైన నర్సాపూర్ అటవీ ప్రాంతానికి అనుకొని గ్రామ భూములు ఉంటాయి. ఇలాంటి ప్రాంతంలో ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేస్తే నర్సాపూర్ అటవీ ప్రాంతంపై ప్రభావం పడి, జీవ వైవిధ్యం దెబ్బతింటుంది కూడా. వ్యవసాయ యోగ్యంకాని భూముల్లో కంపెనీలను ఏర్పాటు చేయకుండా.. నల్లవల్లి గ్రామాన్ని కేటాయించడంపై విమర్శలొస్తున్నాయి.
వెంటనే భూసేకరణ ఆపండి: ఎమ్మెల్సీ అంజిరెడ్డి
ఇండస్ట్రీయల్ పార్కు భూసేకరణ పనులను వెంటనే ఆపాలని, గెజిట్ నుంచి తొలగించాలని రైతులతో కలిసి ఎమ్మెల్సీ అంజిరెడ్డి కలెక్టర్ ప్రతిక్ జైన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధి పేరుతో రైతుల పొట్టకొట్టడం సరికాదన్నారు. పంటలు పండే భూములను పరిశ్రమలకు కేటాయించడం వల్ల రైతు కుటుంబాలు రోడ్డున పడతాయని తెలిపారు. తక్షణమే సదరు సర్వే నంబర్లను భూసేకరణ గెజిట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తే, రైతులతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Read Also: విజయ్ దారిలో వీడీ.. పినరయి విజయన్‌ను కలిసిన సతీశన్
Follow Us On: X(Twitter)

