కలం, వరంగల్ బ్యూరో : పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు హనుమకొండలోని కాళోజి సెంటర్ లో ఆటోలను తాళ్లతో లాగుతూ వినూత్న నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు (Thakkellapally Srinivasa Rao) మాట్లాడుతూ, ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు తాజాగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో మరింత భారం పెరిగిందని అన్నారు. పెట్రో ధరల పెంపుతో రవాణా, నిత్యావసర సరుకులు,కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే పది రోజుల క్రితం వాణిజ్య, గృహ వినియోగ సిలిండర్ ధరలను భారీగా పెంచి కనికరం లేకుండా సామాన్య ప్రజలపై బీజేపీ ప్రభుత్వం భారం మోపిందన్నారు. పీఎం నరేంద్ర మోదీ (PM Modi) ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు ఊడిగం చేస్తూ పేదల సంక్షేమాన్ని విస్మరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన 12 ఏళ్లుగా ఆదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో పాలకులు ముందుకు సాగుతున్నారని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ శక్తులకు దాసోహం అయ్యారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక చర్యలను ప్రతి ఒక్కరూ నిరసించాలని పిలుపునిచ్చారు.
పెంచిన పెట్రోల్, డిజీల్ ధరలను వెంటనే తగ్గించకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని తక్కళ్లపల్లి (Thakkellapally) హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నేదునూరి జ్యోతి, బి.విజయసారధి, జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, నాయకులు ఉట్కూరి రాములు, కర్రె లక్ష్మణ్, స్టాలిన్, ఎదునూరి వెంకట్రాజం, మునిగాల భిక్షపతి, కొట్టెపాక రవి, మాలోత్ శంకర్ నాయక్, కండె నర్సయ్య, గుంటీ రాజేందర్, అలువాల రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Also: విజయ్ దారిలో వీడీ.. పినరయి విజయన్‌ను కలిసిన సతీశన్
Follow Us On: Instagram

