కలం, క్రైమ్ బ్యూరో : గడిచిన రెండేళ్లల్లో తెలంగాణ పోలీసుల ఎదుట రికార్డు స్థాయిలో 820 మంది మావోయిస్టులు లొంగిపోవడం ఎస్ఐబీ సాధించిన విజయం అని డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) కొనియాడారు. లొంగిపోయిన వారిలో నలుగురు సెంట్రల్ కమిటీ సభ్యులు, 22 మంది స్టేట్ కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, 45 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 173 మంది ఏరియా కమిటీ సభ్యుల వంటి అగ్రనేతలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. సోమవారం హైదరాబాద్లోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రస్తుత పరిస్థితి, శాంతిభద్రతలకు ఎదురవుతున్న సవాళ్లు, తీవ్రవాద నిరోధక చర్యలపై డిజిపి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ విజయ్ కుమార్, ఎస్‌ఐబి ఐజిపి కార్తికేయ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) మాట్లాడుతూ.. వామపక్ష తీవ్రవాదాన్ని సమర్థవంతంగా అణచివేయడంలో, క్షేత్రస్థాయి వ్యూహాలను అమలు చేయడంలో ఎస్ఐబీ అద్భుతమైన పాత్ర పోషించిందని ఆయన కొనియాడారు. హింసామార్గాన్ని వీడి ప్రధాన స్రవంతిలో కలిసిన ఈ క్యాడర్ నుంచి పెద్ద ఎత్తున అత్యాధునిక ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, ఇందులో 58 ఏకే-47 రైఫిళ్లు, 48 ఇన్సాస్ రైఫిళ్లు, 50 ఎస్ఎల్ఆర్‌లు, 6 ఎల్‌ఎమ్‌జీలతో పాటు మొత్తం 334 అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయని డీజీపీ వివరించారు.
అనంతరం లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం అందిస్తున్న పునరావాస కార్యక్రమాలను డీజీపీ సమీక్షించారు. వారికి తెలంగాణ పోలీస్ శాఖ నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఉంటాయని భరోసా ఇచ్చారు. లొంగిపోయిన క్యాడర్ కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, వారు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు వీలుగా ఉపాధి శిక్షణ కార్యక్రమాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించి సమాజంలో భాగస్వాములను చేసే బాధ్యత ఎస్ఐబి తీసుకోవాలన్నారు. మారుతున్న సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు.
నాలుగు దశాబ్దాల మావోయిస్టు ఉద్యమం ముగింపు దశకు వచ్చిన తరుణంలో ఇప్పుడు ఎస్ఐబీ తన పరిధిని మరింత విస్తృతం చేసుకోవాలని సూచించారు. సమాజంలో వస్తున్న కొత్త పోకడలు, ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం వల్ల యువతలో వస్తున్న మార్పులు, దానివల్ల తలెత్తే శాంతిభద్రతల సమస్యలపై నిశిత నిఘా పెట్టాలని ఆదేశించారు. భవిష్యత్తులో తెలంగాణ భద్రతకు ఎదురయ్యే సవాళ్లను తిప్పికొట్టేలా రాష్ట్ర పోలీసు విభాగానికి ఎస్ఐబీ వెన్నుదన్నుగా నిలవాలని డిజిపి దిశానిర్దేశం చేశారు.
Read Also: కాంగ్రెస్‌లో కుంపటి.. ఎంపీ అరవింద్ కామెంట్లతో కొత్త చర్చ !
Follow Us On: WhatsApp

