కలం, నల్లగొండ బ్యూరో : పశ్చిమాసియాలో యుద్ధం సామాన్యుడి నడ్డి విరుస్తోంది. ఓవైపు గ్యాస్ కొరతతో అల్లాడిపోతుంటే.. మరోవైపు నిత్యావసరాల ధరలు సైతం పెరిగిపోతున్నాయి. రవాణా ఛార్జీల పేరుతో కూరగాయల ధరలను అమాంతం పెంచేశారు. ఇవన్నీ చాలవన్నట్టుగా ఇప్పుడేమో.. వంట నూనెల (Cooking Oil) ధరలను పెంచేశారు. ఇంటి నుంచి కాలు బయటపెట్టింది మొదలు.. యుద్దం వడ్డింపు సగటు వేతన జీవిపై పడుతోంది. నిన్న మొన్నటి వరకు రూ.10 ఉన్న ఛాయ్ ధర.. ఏకంగా రూ.20కి చేరింది.
ఇప్పుడేమో వంటనూనెలపైనా భారీగా ధర పెంచడం సామాన్యుడికి భారంగా మారుతోంది. యుద్ధం ఇంకా కొనసాగితే మార్కెట్‌లో నూనె దొరకదనే భయం ప్రజల్లో మొదలైంది. నల్లగొండ వంటి జిల్లాల్లోనూ వినియోగదారులు ఒక్కసారిగా 10-15 లీటర్ల డబ్బాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ అకస్మాత్తు డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొన్ని చోట్ల వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరలకు అమ్ముతుండడం కొసమెరుపు.
లీటర్ ప్యాకెట్‌పై సగటున రూ.20 పెంపు..
యుద్దం ఎఫెక్ట్ నేపథ్యంలో కంపెనీలు మార్కెటింగ్ స్ట్రాటజీని పెంచేశాయి. మరో రెండు నెలల వరకు ఇదే పరిస్థితి ఉంటుందంటూ ప్రచారం చేయడం.. రానురానూ అసలు వంట నూనె (Cooking Oil) దొరకడమే గగనం అవుతుందని.. దొరికినా లీటరు నూనె రూ.250కి పైగా పలుకుతుందంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో కొంతమంది కస్టమర్లు తర్వాత ఇబ్బంది పడడం కంటే ముందుగానే కొని పెట్టుకునేందుకు రెడీ అయిపోతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఆయిల్ డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు వంట నూనెల ధరలను పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. వారం రోజుల్లోనే లీటరుపై రూ.20కి పెంచేశారు.
ప్రభుత్వ సంస్థ అయిన విజయ బ్రాండ్‌కు చెందిన పల్లీ ఆయిల్ లీటరుకు హోల్‌సెల్‌గా రూ.180 తీసుకుంటుండగా, రిటైల్ దుకాణాల్లో రూ.185కి పైగా తీసుకుంటున్నారు. అదే సన్‌ఫ్లవర్ ఆయిల్ విషయానికొస్తే.. లీటరుకు హోల్‌సెల్‌గా రూ.180 తీసుకుంటుంటే.. రిటైల్, చిన్న దుకాణాల్లో రూ.190కి పైగా తీసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.200 వరకు విక్రయిస్తున్నారు. ఈ వారం రోజుల్లోనే ఒక్కో లీటరు ప్యాకెట్‌పై రూ.20 నుంచి రూ.30 పెరిగింది. అయితే సదరు వంట నూనె ప్యాకెట్లపై పాత తయారీ డేట్‌తో పాటు పాత ధరే ఉన్నా.. కొత్త ధరల ప్రకారం విక్రయిస్తుండడం గమనార్హం.
Read Also: ఫోన్ లకు ఈ లింక్ వచ్చిందా..? తస్మాత్ జాగ్రత్త..!
Follow Us On: Pinterest

