కలం, వెబ్ డెస్క్: పరీక్షలు వచ్చాయంటే ఆ హడావుడి మామూలుగా ఉండదు. కొన్ని రోజుల పాటు పరీక్షా కేంద్రాల (Exam Center) వద్ద విద్యార్థుల సందడి ఉంటుంది. ఒక్కో పరీక్ష కేంద్రంలో వందల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారు. కానీ నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కేవలం ఒకే ఒక్క విద్యార్థి కోసం ఓ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇంటర్ తర్వాత బ్రిడ్జి కోర్స్ కోసం మ్యాథ్స్ పరీక్ష రాసేందుకు కమ్మరి వరుణ్ సందేశ్ అనే విద్యార్థి ఫీజు కట్టాడు. ఈ పరీక్షకు ఒక్కడే ఫీజు కట్టడంతో నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ రోజు పరీక్ష జరగాల్సి ఉంది. విద్యార్థి వరుణ్ సందేశ్ పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేసి ఐదుగురు సిబ్బంది ఎదురు చూశారు. కానీ, విద్యార్థి పరీక్షకు డుమ్మా కొట్టాడు. ఇక చేసేదేం లేక పరీక్ష కేంద్రం సిబ్బంది ఖాళీగా ఉన్నారు. పరీక్ష సమయం అయిపోగానే తమ విధులు ముగించుకొని వెళ్లిపోతామని తెలిపారు.

