కలం, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress)లో సోషల్ మీడియా పదవుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. గురువారం ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్, కో ఆర్డినేటర్లు, కన్వీనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్‌గా నవీన్ పెత్తెం (Naveen Pettem), కన్వీనర్లుగా కర్ల ఉజ్వల్ రెడ్డి, పెండ్యాల వంశీకృష్ణలను నియమించారు. కో ఆర్డినేటర్లుగా అంబాల శివకుమార్, విష్ణు వర్ధన్ రెడ్డి, వీరపురం రామ్‌లక్ష్మణ్, గీతా అయినాల, ఎండీ అబిద్ అలీ, సుశీల్ కుమార్‌లను నియమించారు. ఈ సందర్భంగా వారు పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. పార్టీ పెద్దలు కూడా వీరందరినీ అభినందించారు.
ఈ పదవుల కేటాయింపుపై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొందని తెలుస్తోంది. పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేసిన వారిని వదిలేసి ఎవరెవరికో పోస్టులు ఇచ్చారని కొందరు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ సోషల్ మీడియా తీవ్ర స్థాయిలో దాడి చేసింది. పదవులు దక్కిన వాళ్లంతా టీడీపీ వాళ్లేనంటూ ఎద్దేవా చేసింది. నవీన్ పెత్తెం (Naveen Pettem) సహా పలువురు టీడీపీలో ఉన్న సమయంలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ బీఆర్ఎస్ మద్దతుదారులు సెటైర్లు గుప్పించారు.
ఇక పార్టీ కో ఆర్డినేటర్‌గా నియమితులైన గీతా అయినాల తన పదవిని నిరాకరించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఈ పదవికి తనను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూనే, తనను జాబితా నుంచి తొలగించాలని ఏఐసీసీని, నవీన్ పెత్తెంను కోరారు. అయితే ఆమె పదవిని వద్దనడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు.
మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ మీడియా అండ్ పబ్లిసిటీ విభాగం ఇంచార్జ్‌గా భువనగరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని నియమించారు. తన నియామకం పట్ల చామల సంతోషం వ్యక్తం చేస్తూ పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు.

