కలం, కరీంనగర్ బ్యూరో: పక్కా స్క్రీన్ ప్లేని తలపించే క్రైమ్ వ్యూహం.. పోలీసులు అమర్చిన సీసీ కెమెరాల కళ్లకు స్ప్రే రంగులు.. ఏటీఎంలో ఎక్కడ కట్ చేస్తే క్యాష్ దొరుకుతుందో తెలిసిన ‘సర్జికల్’ కటింగ్.. నేరం చేసిన తర్వాత టోల్ గేట్ల కెమెరాలకు చిక్కకుండా ‘గూగుల్ మ్యాప్స్’ సహాయంతో గ్రామీణ ‘D-రూట్’ గుండా అంతర్రాష్ట్ర సరిహద్దులు దాటేయడం.. కరీంనగర్ (Karimnagar) జిల్లా తిమ్మాపూర్, దుర్శేడు ఏటీఎం కేంద్రాల్లో ఆదివారం తెల్లవారుజామున నిమిషాల వ్యవధిలోనే జరిగింది. కేవలం రూ.15 లక్షల సాధారణ ఏటీఎం చోరీ (ATM Robbery) కాదు. ఇది తెలంగాణ పోలీసు నిఘా వ్యవస్థలోని సాంకేతిక పరిజ్ఞానాన్నే నేరుగా సవాల్ చేసిన అంతర్రాష్ట్ర ‘హర్యానా మేవాత్ గ్యాంగ్’ (Haryana Mewat Gang) హైటెక్ నేర విన్యాసం.
‘సర్జికల్’ కటింగ్ … టెక్నికల్ ఎక్స్పర్ట్ హస్తం
దర్యాప్తులో పోలీసు అధికారులను సైతం ముఠా పనితీరు ఆశ్చర్యపరిచింది. ఏటీఎం యంత్రాన్ని ఎక్కడ పడితే అక్కడ పగలగొడితే సమయం వృథా కావడమే కాకుండా సెక్యూరిటీ సైరన్లు మోగే ప్రమాదం ఉంది. కానీ, ఈ ముఠాలో ఉన్న ‘టెక్నికల్ ఎక్స్పర్ట్’ ఏటీఎం మోడల్‌పై పూర్తి అవగాహనతో, మిషన్ మొత్తాన్ని పాడుచేయకుండా కేవలం క్యాష్ ట్రే ఉన్న భాగంపైన మాత్రమే గ్యాస్ కట్టర్‌తో ఖచ్చితమైన కట్ చేసి నిమిషాల్లో నగదును ఖాళీ చేశాడు. ఫుటేజ్‌లో దొంగలు దొరక్కుండా ఉండేందుకు ఒక దుండగుడు బురఖా/చీర కట్టుకుని వచ్చి ఏటీఎంలోని ప్రధాన సీసీ కెమెరాలకు రంగు పూశాడు. ఇది పోలీసుల దర్యాప్తును ఆరంభంలోనే మహిళా నేరస్తుల వైపు మళ్లించేందుకు వేసిన పక్కా మైండ్ గేమ్ అని తెలుస్తోంది.
‘D-రూట్’ వ్యూహం.. గూగుల్ మ్యాప్స్‌తో కళ్లలో దుమ్ము!
నేరానికి పాల్పడడం ఒక ఎత్తైతే, తప్పించుకునేందుకు ఈ కేటుగాళ్లు వాడిన నెట్వర్క్ రూట్ దర్యాప్తు అధికారులనే విస్తుపోయేలా చేసింది. టోల్ ఎస్కేప్ తో రహదారులపై ఉండే హై-రిజల్యూషన్ కెమెరాల కంట పడకుండా జాగ్రత్త పడ్డారు. గూగుల్ మ్యాపింగ్ ‘గూగుల్ మ్యాప్స్’ సాయంతో కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలలోని ప్రధాన టోల్ ప్లాజాలను దాటవేస్తూ, గ్రామీణ అంతర్గత రహదారులను ఎంచుకున్నారు. కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని ఏ ఒక్క ప్రధాన టోల్ ప్లాజా వద్ద కూడా ఈ నకిలీ నంబర్ ప్లేట్ ఉన్న స్కోర్పియో వాహనం రికార్డు కాలేదు. గ్రామాల మీదుగా ఆసిఫాబాద్ దాటి మహారాష్ట్రలోని చంద్రపూర్ సరిహద్దుల వైపు ఈ ముఠా పరారైనట్లు గ్రామీణ ప్రాంత సీసీటీవీ ట్రైల్స్ ద్వారా తెలుస్తోంది.
నిజామాబాద్, మెదక్ టూ కరీంనగర్
గతంలో నిజామాబాద్ జిల్లా బాల్కొండ, అలాగే మెదక్ జిల్లాల్లో సరిగ్గా ఇదే శైలిలో జరిగిన ఏటీఎం చోరీలను, కరీంనగర్ ఘటనతో పోల్చి చూసిన పోలీసులకు సంచలన నిజాలు వెల్లడయ్యాయి. రాత్రి 2:00 నుంచి 4:00 గంటల మధ్య సమయాన్నే ఎంచుకోవడం, ఏటీఎం క్యాష్ బాక్సులనే టార్గెట్ చేసి గ్యాస్ కట్టర్లు వాడటం, హర్యానాలోని మేవాత్ ప్రాంతానికి చెందిన ముఠాల నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉండటం వంటి ఆధారాలు పరిశీలిస్తే తెలంగాణ వ్యాప్తంగా వరుస ఏటీఎం చోరీలకు పాల్పడుతోంది ఒకే అంతర్రాష్ట్ర శ్రేణి నెట్వర్క్ అనే బలమైన నిర్దారణకు పోలీసులు వచ్చారు.
అంతర్రాష్ట్ర ఛేజింగ్
ఈ హైటెక్ గ్యాంగ్‌కు చెక్ పెట్టేందుకు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. మహారాష్ట్ర, హర్యానా పోలీసులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ సాంకేతిక ఆధారాల ద్వారా ఆ స్కోర్పియో వాహన జాడను పట్టుకునేందుకు ఆపరేషన్ ముమ్మరం చేశారు. గ్రామీణ రోడ్ల మాయాజాలంతో డిజిటల్ మ్యాపింగ్ సాయంతో పోలీసుల కళ్లు గప్పి పారిపోయిన ఈ హర్యానా కేటుగాళ్ల ఆటను తెలంగాణ పోలీసులు ఎంత త్వరగా కట్టిస్తారో వేచి చూడాల్సిందే!

