కలం, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) రాజకీయంగా అగ్నిపరీక్షను ఎదుర్కోబోతున్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైతే అక్కడ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత ఆయనదే అవుతుంది. ఇప్పటికే కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమితో కేటీఆర్ వ్యూహం ఫెయిల్ అయింది. అదే సమయంలో ఈ రెండింటిలోనూ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుతో సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహం వర్కవుట్ అయింది.
దీంతో ఈసారి ఖైరతాబాద్ ఉప ఎన్నిక గెలుపు అభ్యర్థుల కంటే కేటీఆర్, సీఎం రేవంత్ కే ఛాలెంజింగ్ టాస్క్‌లా మారింది. ఇక్కడ ఉప ఎన్నిక వస్తుందా? లేదా? అన్నది ఇంకా స్పష్టం కానప్పటికీ.. ఒకవేళ బైపోల్ అనివార్యమైతే ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడక తప్పదు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే సీఎం రేవంత్‌రెడ్డికి హ్యాట్రిక్ విక్టరీ అవుతుంది. అది కేటీఆర్‌కు హ్యాట్రిక్ ఓటమిగా మారుతుంది. దీంతో ఆయన వ్యక్తిగత ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే.. ఆ పార్టీ గ్రాఫ్ కొంత పెరిగే అవకాశం ఉంటుంది. అది సీఎం రేవంత్‌కు వ్యక్తిగతంగా ఊహించని షాక్ అవుతుంది.
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన తెలంగాణ ప్రజలకు ఒక పీడ కల అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై నిప్పులు చెరిగిన కేటీఆర్.. మరో రెండేండ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనని, కేసీఆర్ సీఎం కాబోతున్నారంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అన్ని సెక్షన్ల ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని, కేసీఆర్‌ను దూరం చేసుకుని పొరపాటు చేశామంటూ జనం రియలైజ్ అవుతున్నారని కామెంట్ చేశారు. కానీ ఆ పార్టీ జిల్లాల నేతల్లో మాత్రం మరో రకమైన అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
కాంగ్రెస్‌పై పెరిగిన వ్యతిరేకత బీఆర్ఎస్‌కు ఇంకా అనుకూలంగా మారలేదని, అందుకే ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో తిరిగి డబ్బును ఖర్చు పెట్టదల్చుకోలేదనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు. కేటీఆర్ మాటల ప్రకారం ఖైరతాబాద్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిచి తీరుతుందన్నది స్పష్టమవుతుంది. ఆ అంచనా వర్కవుట్ అయితే అటు పార్టీ పరంగా, ఇటు వ్యక్తిగతంగా కేటీఆర్ ఇమేజ్ ఎంత పెరుగుతుందో.. ఆ అంచనా తలకిందులైతే డ్యామేజ్ సైతం అంతే ఘోరంగా ఉంటుందనేది బీఆర్ఎస్ కేడర్ నుంచే వినిపిస్తున్నది.
ఇజ్జత్ కా సవాల్
వరుసగా రెండు అసెంబ్లీ సెగ్మెంట్లను చేజార్చుకున్న కేటీఆర్‌కు ఖైరతాబాద్ బై ఎలక్షన్ ‘ఇజ్జత్ కా సవాల్’గా మారింది. ఇక్కడ గెలిస్తేనే అటు పార్టీలో, ఇటు ప్రజల్లో ఆయన ఇమేజ్ పెరుగుతుంది. అంచనాలు తలకిందులైతే ఇమేజ్ ఊహించనంతగా పడిపోతుందనే ఆందోళన లీడర్లలో వ్యక్తమవుతున్నది. గత ఎన్నికల్లో నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం లాంటి పలు జిల్లాల్లో బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోయింది. గ్రేటర్ పరిధిలోని సెగ్మెంట్లలో మాత్రం గెలిచామంటూ క్రెడిట్‌ను కేటీఆర్ తీసుకున్నారు. కానీ వరుసగా రెండు ఉప ఎన్నికల్లో ఓడిపోయి పార్టీ అభాసుపాలైంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఖైరతాబాద్‌లో గెలుపు కేటీఆర్‌కు కీలకంగా మారింది. దానం నాగేందర్‌ను గెలిపించుకుంటే కాంగ్రెస్‌లోకి వెళ్లారంటూ నిప్పులు చెరిగి కోర్టు వరకూ వెళ్లి కొట్లాడిన కేటీఆర్.. ఇక్కడి ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం ‘డూ ఆర్ డై’గా మారింది. ఇది వ్యక్తిగతంగా కేటీఆర్ ఇమేజ్‌కు, పార్టీ భవిష్యత్తును నిర్ణయించేదిగా మారనున్నది.
రేవంత్ వర్సెస్ కేటీఆర్
ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఉప ఎన్నిక తప్పనిసరి అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ తరఫున నిలబడే అభ్యర్థులు ఎవరైనా వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మాత్రం సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వంతు అవుతుంది. గెలుపు అభ్యర్థులదే అయినా అసలు హీరోలు మాత్రం వీరిద్దరే. జూబ్లీహిల్స్ గెలుపు కోసం ముఖ్యమంత్రి అమలు చేసిన వ్యూహానికి బీఆర్ఎస్ విలవిల్లాడింది. అర్బన్‌లో తిరుగులేదనుకున్న కేటీఆర్‌కు ఊహించని చేదు అనుభవం ఎదురైంది.
ఇక ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నికలో అటు సీఎం రేవంత్‌రెడ్డి, ఇటు దానం నాగేందర్‌ను తట్టుకుని గెలుపు కోసం కేటీఆర్ సర్వశక్తులా పోరాడాల్సి ఉంటుంది. దానంను ఒడించేంత దీటైన అభ్యర్థి బీఆర్ఎస్‌కు లేరన్న సాధారణ అభిప్రాయమూ నియోజకవర్గంలో నెలకొన్నది. ఆసిఫ్‌నగర్‌లో మూడుసార్లు, డీలిమిటేషన్ తర్వాత ఖైరతాబాద్‌లో మూడుసార్లు గెలిచిన దానం నాగేందర్.. మళ్లీ గెలుస్తానన్న ధీమాతో ఉన్నారు. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ తర్వాత ఉప ఎన్నిక సంగతి తేలనున్నది. ఆ తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల వ్యూహాలు సిద్ధం కానున్నాయి.

