ధర్నాలతో దద్దరిలిన గద్వాల.. భారీ ర్యాలీ

కలం, జోగులాంబ గద్వాల: సాగు నీరు విడుదల చేయాలంటూ రైతులు చేపట్టిన ఆందోళనలతో గద్వాల (Gadwal) పట్టణం దద్దరిల్లింది. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి కలెక్టరేట్ నుంచి జమ్మిచెడు వరకు భారీగా ర్యాలీగా వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిలదీశారు‌. జమ్ములమ్మ ఆలయం రోడ్డు, కర్నూల్ రోడ్డుపై బైఠాయించారు. దీంతో గద్వాల – కర్నూలు ప్రధాన రహదారిపై అయిదు గంటల‌పాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ ఆందోళన కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా నాయకురాలు డీ.కే.స్నిగ్ధారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ జడ్పీటీసీ సభ్యులు బాసు శ్యామల హనుమంతు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

మూడు రోజులు వదలాలి..

​బీజేపీ నాయకురాలు స్నిగ్ధారెడ్డి మాట్లాడుతూ.. గతంలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే.అరుణ నడిగడ్డలో రిజర్వాయర్లు ఏర్పాటు చేయించి నీటిని వదిలేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తే.. నేడు రిజర్వాయర్లలో నీరు లేని పరిస్థితి దాపురించిందని విమర్శించారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి స్పందించకపోగా.. వరి పంట ఎందుకు వేశారని ప్రశ్నించడం సరికాదన్నారు. వారంలో కనీసం మూడు రోజులు నీరు వదిలి పంటలను కాపాడాలని అధికారులను కోరారు.

​బీఆర్ఎస్ నాయకురాలు బాసు శ్యామల హనుమంతు నాయుడు మాట్లాడుతూ.. తెలంగాణ రైతుల ప్రయోజనాలను పక్కనపెట్టి జూరాల నీటిని ఆంధ్రా ప్రాంతాలకు ఎలా తరలిస్తారు? అని ప్రశ్నించారు. జూరాల కుడి కాలువల గేట్లను ఎందుకు మూసివేశారో ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే జూరాల గేట్లు ఎత్తి చివరి ఆయకట్టు వరకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

​24 గంటల హామీతో విరమణ..

సుమారు అయిదు గంటల పాటు కొనసాగిన ఈ ధర్నాతో గద్వాల – కర్నూలు రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ధర్నా స్థలానికి చేరుకున్న ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు రైతులతో చర్చలు జరిపారు. 24 గంటల వ్యవధిలో కాలువలకు నీటిని విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు. 24 గంటల్లో నీళ్లు ఇవ్వని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>