కలం, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో మ్యారేజ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. పెళ్లిళ్లు కుదరడం కష్టంగా ఉన్న కుటుంబాల బలహీనతను ఆసరాగా చేసుకుని ఓ ముఠా మోసానికి తెగబడింది. ‘అనాథాశ్రమంలోని యువతులతో పెళ్లిళ్లు జరిపిస్తాం’ అంటూ నమ్మబలికి లక్షల రూపాయలు చేసింది. పెళ్లి ముహూర్తం కోసం వరులు, వారి కుటుంబాలు వేడుక ప్రాంగణానికి చేరుకున్నా.. అక్కడ పెళ్లి మండపం లేదు, వధువులు లేరు. చివరికి తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
మోసం జరిగిందిలా..
దేవాస్‌లో మే 25న సామూహిక వివాహాలు నిర్వహిస్తామని నిందితులు ప్రచారం చేశారు. ఇందుకోసం మధ్యప్రదేశ్‌లోని పలు జిల్లాలకు యువకుల కుటుంబాలను సంప్రదించారు. ‘ఇందోర్‌లోని అనాథాశ్రమంలో ఉన్న యువతులతో వివాహాలు జరిపిస్తాం’ అంటూ నమ్మించారు. సోషల్ మీడియాలోని యువతుల ఫొటోలను డౌన్‌లోడ్ చేసి.. అవే వధువుల ఫొటోలంటూ కుటుంబాలకు చూపించారు. వివాహాల కోసం ఒక్కో కుటుంబం నుంచి రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం. మొత్తం మోసం రూ.10 లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. వివాహాలకు ముందు మే 24న మాతా టెక్రీ దర్శనం ఏర్పాటు చేస్తామని, అనంతరం రాధాగంజ్‌లోని క్లబ్ గ్రౌండ్‌లో వసతి కల్పిస్తామని బాధితులకు చెప్పారు.
గంటల తరబడి వేచి చూసిన బాధితులు
మే 24 ఉదయం నుంచే వివిధ జిల్లాల నుంచి వరులు, వారి బంధువులు దేవాస్‌కు చేరుకున్నారు. కొందరు ఉదయం 8 గంటలకే కొత్త బట్టలు ధరించి, పెళ్లి కోసం సిద్ధమై వచ్చారు. అయితే అక్కడికి వెళ్లాక ఎలాంటి ఏర్పాట్లు కనిపించలేదు. పెళ్లి మండపం లేకపోవడం, వధువులు కనిపించకపోవడంతో కుటుంబాలు నిర్వాహకులను ప్రశ్నించాయి. నిర్వాహకులుగా ఉన్న ముకేశ్ బైరాగి, అతని భార్య సునీత బైరాగి.. “ఇందోర్ నుంచి వధువులు వస్తున్నారు” అంటూ గంటల తరబడి బాధితులను నమ్మిస్తూ వచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఒక్కోసారి ఒక్కో సాకు చెబుతూ కాలయాపన చేశారు. చివరకు రాత్రి 10 గంటల సమయంలో తాము మోసపోయామని బాధిత కుటుంబాలు గ్రహించాయి.
దర్యాప్తులో సంచలన విషయాలు
దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. సోషల్ మీడియా నుంచి మోడల్స్, యువతుల ఫొటోలను సేకరించి వాటినే వధువుల ఫొటోలుగా చూపించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో ముకేశ్ బైరాగి కీలక వివరాలు వెల్లడించినట్లు సమాచారం. ఇందోర్‌లో పనిచేస్తున్న తన అన్న దినేశ్ దాస్ బైరాగి ఈ వ్యవహారాన్ని ప్రారంభించాడని, పెళ్లి కొడుకుల కుటుంబాల ఫోన్ నంబర్లు కూడా అతడే ఇచ్చాడని తెలిపాడు. కుటుంబాలు దేవాస్‌కు చేరుకున్న తర్వాత దినేశ్‌కు ఫోన్ చేయగా.. “వధువులతో త్వరలో వస్తున్నాం” అని చెప్పాడని, ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడని వెల్లడించాడు. ఈ వ్యవహారంలో తన మామ నర్సింగ్ దాస్ బైరాగి మధ్యవర్తిగా వ్యవహరించాడని కూడా ముకేశ్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. బాధిత కుటుంబాలను నిందితులతో కలిపింది కూడా అతడేనని విచారణలో తేలింది.
నిందితుల కోసం గాలింపు
ఈ ఘటనపై పోలీసులు ముకేశ్ బైరాగి, సునీత బైరాగి, దినేశ్ బైరాగి, నర్సింగ్ దాస్ బైరాగిలపై కేసు నమోదు చేశారు. ముకేశ్, సునీతలను ఇప్పటికే అరెస్టు చేశారు. పరారీలో ఉన్న దినేశ్, నర్సింగ్ దాస్ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. అదనపు ఎస్పీ జైవీర్ భదోరియా మాట్లాడుతూ.. మే 24 సాయంత్రం ఈ ఘటనపై సమాచారం అందిందన్నారు. బాధితుడు అభిషేక్ ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 318(4) కింద చీటింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధితుల నుంచి మరిన్ని ఫిర్యాదులు కూడా స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు.

