కలం, క్రైమ్ బ్యూరో: తెలంగాణలో అనూహ్య వాతావరణ మార్పులు, ఆకస్మిక భారీ వర్షాలు, అగ్ని ప్రమాదాలు, పారిశ్రామిక ప్రమాదాలు చోటుచేసుకుంటూ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సహకారంతో సోమవారం రాష్ట్ర స్థాయి మాక్ ఎక్సర్‌సైజ్ (Mock Drills)ను రెండోసారి నిర్వహించింది. వరద ముప్పు ఉన్న ప్రాంతాలను ఆధారంగా తీసుకొని ఖమ్మం, వరంగల్, కామారెడ్డి, నిజామాబాద్, జోగులాంబ గద్వాల్, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, నారాయణపేట, ములుగు, వనపర్తి, హనుమకొండ జిల్లాల్లో మాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహించారు. ప్రధాన పారిశ్రామిక ప్రాంతాల ఆధారంగా సంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఈ విన్యాసాలు చేపట్టారు.
అటవీ అగ్నిప్రమాదాల నేపథ్యంలో కుమురం భీం ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహించారు. ఈ విన్యాసాల ద్వారా వరద హెచ్చరిక సంకేతాలు, అత్యవసర పరిస్థితుల్లో అనుసరించాల్సిన విధానాలపై అవగాహన కల్పించారు. పారిశ్రామిక ప్రమాదాల మాక్ ఎక్సర్‌సైజ్‌ల ద్వారా అగ్నిప్రమాదాలు, రసాయన ప్రమాదాల సమయంలో సమీప పరిశ్రమల మధ్య పరస్పర సహకారం అవసరమని గుర్తించారు. మానవ వనరులు, పరికరాలు, నైపుణ్యాలను పంచుకోవడం ద్వారా స్పందన సమయం, నష్టాలను తగ్గించవచ్చని అధికారులు పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో తెలంగాణలో వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం, పొడి వృక్ష సంపద, మానవ నిర్లక్ష్యం, వాతావరణ కారణాల వల్ల అటవీ అగ్నిప్రమాదాలు పెరుగుతున్నాయి. ఇవి అటవీ సంపద, వన్యప్రాణులు ,జీవ వైవిధ్యానికి తీవ్రమైన నష్టం కలిగించడమే కాకుండా సమీప గ్రామాలు, ప్రజల భద్రతకు ముప్పుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు సిద్ధత అవసరాన్ని గుర్తించి తెలంగాణ అగ్నిమాపకశాఖ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, తెలంగాణ అటవీ శాఖ ఇతర శాఖల సమన్వయంతో అటవీ అగ్నిప్రమాదాలపై మాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహించారు.
ఈ మాక్ ఎక్సర్‌సైజ్ (Mock Drills) ద్వారా అటవీ ప్రాంతాల సమీపంలో నివసించే ప్రజల్లో అగ్నిప్రమాదాల నివారణ, తొందరగా సమాచారం అందించడం, భద్రతా చర్యలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే కార్యాచరణలో ఉన్న లోపాలను గుర్తించడం, శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం, స్పందనా బృందాల సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడం జరిగింది.ఈ మాక్ ఎక్సర్‌సైజ్‌లు తెలంగాణ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ డీజి విక్రమ్ సింగ్ మాన్ పర్యవేక్షణలో నిర్వహించబడ్డాయి.
Read Also: కాంగ్రెస్‌లో కుంపటి.. ఎంపీ అరవింద్ కామెంట్లతో కొత్త చర్చ !
Follow Us On: WhatsApp

