దసరా కానుకపై కాంగ్రెస్ సర్కార్ కసరత్తు.. రేపే లాస్ట్ డేట్!

కలం, తెలంగాణ బ్యూరో: దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పలు సెక్షన్ల ప్రజలకు తీపి కబురు అందించనున్నది. ఇందులో భాగంగా మహిళలకు సైతం కొత్తగా పింఛన్లు మంజూరు చేయనున్నది. ఇందుకు సంబంధించిన కసరత్తు వారం రోజుల్లో పూర్తికానున్నది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన మహిళలకు ‘చేయూత’ పింఛన్లు (Cheyutha Pension) మంజూరు చేయనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇప్పటికే ప్రకటించారు. తొలుత సెప్టెంబర్‌ 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించిన ప్రభుత్వం.. అనంతరం ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 28 నాటికి మొత్తం 5.96 లక్షల దరఖాస్తులు అందగా.. వీటిలో 4.42 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ఈసారి వితంతు, ఒంటరి, దివ్యాంగ మహిళలతో పాటు హెచ్‌ఐవీ బాధితులు, డయాలసిస్‌ రోగులు, రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారికి కూడా ప్రభుత్వం పింఛన్లు అందించనున్నది. హైదరాబాద్‌, మల్కాజిగిరి జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో 50 శాతానికి పైగా దరఖాస్తుల పరిశీలన పూర్తయింది.

ఆయా జిల్లాల కొత్త దరఖాస్తులు :

రాష్ట్రంలో ‘చేయూత’ పింఛన్ల పథకం కింద నూతనంగా సమర్పించిన దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన (వెరిఫికేషన్) ప్రక్రియ అత్యంత వేగంగా కొనసాగుతోంది. జిల్లాల వారీగా అందిన దరఖాస్తుల వివరాలను గమనిస్తే… హైదరాబాద్‌లో అత్యధికంగా 44,745 దరఖాస్తులు రాగా అందులో 20,172 వెరిఫై అయి 23,901 పెండింగ్‌లో ఉన్నాయి. నల్లగొండలో 32,991 కి గాను 28,622 పూర్తి కాగా 4,102 మిగిలి ఉన్నాయి; మల్కాజిగిరిలో 32,665 అప్లికేషన్లలో 8,204 వెరిఫై కాగా 22,234 పెండింగ్‌లో ఉన్నాయి. రంగారెడ్డిలో 27,871 కి గాను 21,218 పూర్తి కాగా 15,661 మిగిలి ఉన్నాయి. ఖమ్మంలో 27,766 లో 23,188 క్లియర్ కాగా 4,578 పెండింగ్‌లో ఉన్నాయి. కరీంనగర్‌లో 24,631 కి గాను 20,250 పూర్తి కాగా 4,377 మిగిలి ఉన్నాయి. నిజామాబాద్‌లో 24,072 లో 19,289 వెరిఫై అయి 4,765 పెండింగ్‌లో ఉన్నాయి.

సూర్యాపేటలో 22,487 కి గాను 19,778 క్లియర్ కాగా 2,709 మిగిలి ఉన్నాయి. సంగారెడ్డిలో 21,011 లో 17,933 పూర్తి కాగా 3,047 పెండింగ్‌లో ఉన్నాయి. కొత్తగూడెంలో 19,346 లో 12,929 క్లియర్ కాగా 6,389 మిగిలి ఉన్నాయి. భువనగిరిలో 18,308 కి గాను 16,026 పూర్తి కాగా 2,282 పెండింగ్‌లో ఉన్నాయి. జగిత్యాలలో 17,494 లో 11,360 వెరిఫై అయి 6,134 మిగిలి ఉన్నాయి. వికారాబాద్‌లో 17,395 కి గాను 13,838 క్లియర్ కాగా 3,493 పెండింగ్‌లో ఉన్నాయి. మహబూబ్‌నగర్‌లో 15,571 లో 13,122 పూర్తి కాగా 2,446 మిగిలి ఉన్నాయి. ఆదిలాబాద్‌లో 15,467 కి గాను 10,690 వెరిఫై అయి 4,745 పెండింగ్‌లో ఉన్నాయి. పెద్దపల్లిలో 15,259 లో 11,343 క్లియర్ కాగా 3,916 మిగిలి ఉన్నాయి. వరంగల్‌లో 15,257 కి గాను 11,498 పూర్తి కాగా 3,759 పెండింగ్‌లో ఉన్నాయి. మహబూబాబాద్‌లో 15,174 లో 12,276 క్లియర్ కాగా 2,893 మిగిలి ఉన్నాయి; హన్మకొండలో 15,019 కి గాను 11,301 వెరిఫై అయి 3,718 పెండింగ్‌లో ఉన్నాయి.

కామారెడ్డిలో 14,819 లో 13,551 పూర్తి కాగా 1,268 మిగిలి ఉన్నాయి. సిద్దిపేట్‌లో 14,477 కి గాను 12,364 క్లియర్ కాగా 2,111 పెండింగ్‌లో ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌లో 14,323 లో 11,826 వెరిఫై అయి 2,497 మిగిలి ఉన్నాయి. మంచిర్యాలలో 13,744 కి గాను 11,986 పూర్తి కాగా 1,752 పెండింగ్‌లో ఉన్నాయి. మెదక్‌లో 13,724 లో 13,006 క్లియర్ కాగా కేవలం 718 మిగిలి ఉన్నాయి. నారాయణపేటలో 13,241 కి గాను 11,180 వెరిఫై అయి 2,061 పెండింగ్‌లో ఉన్నాయి. గద్వాల్‌లో 12,268 లో 10,622 పూర్తి కాగా 1,565 మిగిలి ఉన్నాయి. నిర్మల్‌లో 11,913 కి గాను 11,106 క్లియర్ కాగా 2,282 పెండింగ్‌లో ఉన్నాయి. జనగామలో 11,826 లో 9,858 వెరిఫై అయి 1,968 మిగిలి ఉన్నాయి. వనపర్తిలో 10,312 కి గాను 9,090 పూర్తి కాగా 1,222 పెండింగ్‌లో ఉన్నాయి. సిరిసిల్లలో 10,035 లో 8,338 క్లియర్ కాగా 1,697 మిగిలి ఉన్నాయి. ఆసిఫాబాద్‌లో 9,466 కి గాను 6,700 వెరిఫై అయి 2,679 పెండింగ్‌లో ఉన్నాయి. భూపాలపల్లిలో 8,037 లో 5,930 పూర్తి కాగా 2,107 మిగిలి ఉన్నాయి. ములుగు జిల్లాలో అందిన 4,818 దరఖాస్తుల్లో 4,013 వెరిఫై కాగా కేవలం 805 అప్లికేషన్లు పరిశీలించాల్సి ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

ఐరిస్‌, బయోమెట్రిక్‌ ద్వారా క్రాస్‌చెక్‌

ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అర్హులైన లబ్ధిదారులు మాత్రమే ఎంపికయ్యేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నది. దళారుల జోక్యానికి తావు లేకుండా పూర్తిగా పారదర్శక పద్ధతిలో జరిగేలా ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్లను స్వీకరించింది. ప్రతీ జిల్లాకు ప్రత్యేకంగా ఒక వెరిఫికేషన్ అధికారిని నియమించిన ప్రభుత్వం ఈ దరఖాస్తుల పరిశీలనకు ప్రత్యేక మెకానిజం రూపొందించింది. తొలుత వెరిఫికేషన్‌ అధికారులు దరఖాస్తులను పరిశీలించి.. ఆధార్‌ వివరాల ఆధారంగా ప్రాథమిక స్థాయిలో అర్హతలను తనిఖీ చేస్తున్నారు. అనంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తుదారులు ఇచ్చిన వివరాలు వాస్తవమేనా? కాదా? అన్నది పరిశీలిస్తున్నారు. ఇందుకోసం ఫొటోలు, ఐరిస్‌ తదితర బయోమెట్రిక్‌ వివరాలను కూడా క్రాస్చెక్‌ చేస్తున్నారు.

4.42 దరఖాస్తుల పరిశీలన పూర్తి

ఇప్పటివరకు అందిన 5.96 లక్షల దరఖాస్తుల్లో 4.42 దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ఈ పరిశీలన తర్వాత ఎన్ని దరఖాస్తులకు క్లియరెన్స్ లభించే అవకాశం ఉన్నది. ఎన్ని రిజెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది? అనే వివరాలను ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్నది. దసరా పండుగ వరకూ పెండింగ్‌లో పెట్టకుండా ముందుగానే తేల్చాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తున్నది.

మల్టిపుల్ వెరిఫికేషన్.. బోగస్‌కు చెక్

ప్రభుత్వానికి అందిన దరఖాస్తులను మొత్తం ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత స్వయంగా ఆయా జిల్లాల కలెక్టర్లు రాండమ్గా కొన్ని దరఖాస్తులకు సంబంధించిన వివరాలను క్రాస్ చెక్ చేసేందుకు తనిఖీలు నిర్వహిస్తారు. ఆ తర్వాత పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని దశల్లోని వెరిఫికేషన్, క్రాస్ చెక్ ప్రక్రియలు పూర్తయిన తర్వాత తుది జాబితాను కలెక్టర్లు ‘సెర్ప్’కు పంపనున్నారు. ప్రభుత్వం తొలుత రెండున్నర లక్షల మంది కొత్త లబ్ధిదారులకు చేయూత పింఛన్లను అందించాలని భావించింది. అప్లికేషన్లు రెట్టింపు దాటడంతో చివరకు ఎన్ని ఫైనల్ అవుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి ప్రభుత్వం తన వంతు చేయూతగా నిలవాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్‌ కింద కొత్త లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నందున ఎలాంటి లోపాలకు తావు లేకుండా పర్ఫెక్ట్‌గా ఎంపిక జరగాలని భావిస్తున్నది. అందువల్ల మల్టిపుల్ వెరిఫికేషన్ ద్వారా పకడ్బందీ మెకానిజాన్ని రూపొంచింది. దసరా పండుగకు ముందే లబ్దిదారుల జాబితా ఫైనల్ కానున్నది. అమలుపై పండుగ సందర్భంగా ప్రభుత్వం ప్రకటన చేయనున్నది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>