కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు (Manuguru) మండలం పి.వి. కాలనీలోని సూపర్ బజార్ T2 లైన్ ప్రాంతంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమై స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఒక్కసారిగా నివాస ప్రాంతంలోకి కొండచిలువ రావడంతో కాలనీవాసులు భయంతో పరుగులు తీశారు. ఈ సమాచారం అందుకున్న ప్రముఖ స్నేక్ క్యాచర్ ముజాఫర్ తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించి, చాకచక్యంగా ఆ కొండచిలువను బంధించారు. ముజాఫర్ అప్రమత్తంగా వ్యవహరించి పామును పట్టుకోవడంతో కాలనీవాసులు, స్థానికులు ఊపిరి పీల్చుకోవడమే కాకుండా ఆయన సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని అభినందించారు. అనంతరం పట్టుకున్న కొండచిలువను అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు.

