అశ్వారావుపేట బస్టాండ్‌లో నరకయాతన అనుభవిస్తున్న వృద్ధురాలు!

కలం, ఖమ్మం బ్యూరో: “అమ్మ అని పిలిచే పెదవుల వెనుక ఎన్నో త్యాగాలుంటాయి..” అంటారు. కానీ, ఆ అమ్మే వృద్ధాప్యంలోకి అడుగుపెట్టి ఆసరా కోరితే.. “నాకేం సంబంధం లేదు” అని కన్నబిడ్డలే మొహం చాటేసిన దారుణ ఘటన అశ్వారావుపేటలో వెలుగుచూసింది. నవమాసాలు మోసి, రక్తమాంసాలను ధారపోసి పెంచి పెద్ద చేసిన కన్నపేగు బంధాలు కరిగిపోయాయి. మనుషుల్లో మానవత్వం ముసుగు తొలగి, రాతి గుండెలే మిగిలాయని నిరూపిస్తూ.. ఆ వృద్ధురాలికి అశ్వారావుపేట (Aswaraopeta) బస్టాండే ఆఖరి శరణాలయంగా మార్చేశారు. ​గత 20 రోజులుగా దిక్కుతోచని స్థితిలో, జీవిత చరమాంకంలో కొట్టుమిట్టాడుతున్న ఆ వృద్ధురాలిని చూసిన వారి కళ్లు చెమర్చక మానవు. కనీసం లేవలేని, నడవలేని దీన స్థితిలో ఉన్న ఆమెకు బస్టాండ్ ప్రాంగణంలోని అరుగులే పట్టిమంచంగా మారాయి.

​బాధితురాలి వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకులపల్లి మండలం జగన్నాథపురం సమీపంలోగల చింతపేటకు చెందిన సోయం భద్రమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె భర్త, ఒక కుమారుడు గతంలోనే మరణించారు. మరో కుమారుడు పాల్వంచలో, కుమార్తె పెనుబల్లిలో నివాసముంటున్నారు. ​బస్టాండ్‌లో ఆమె పడుతున్న నరకయాతనను చూసి చలించిపోయిన కొందరు బాటసారులు ఆ వృద్ధురాలిని విచారించగా, ఆమె స్వగ్రామం చింతపేట అని తెలిసింది. స్థానికుల సహకారంతో పెనుబల్లిలో ఉన్న కుమార్తెకు ఫోన్ చేసి ఆమె పరిస్థితిని వివరిస్తే.. “నాకు సంబంధం లేదు” అని నిష్ఠురంగా తేల్చి చెప్పింది. పాల్వంచలోని కుమారుడికి ఫోన్ చేసినా అసలు స్పందనే లేదు.

​ప్రస్తుతం చుట్టూ ఈగలు, దోమలు ముసురుతుంటే తాను ఏ స్థితిలో ఉందో కూడా గ్రహించలేని అచేతన స్థితిలో ఆ వృద్ధురాలు అలమటిస్తోంది. ఈ అమానుష ఘటనపై స్పందించిన స్థానిక దుకాణదారులు ములకులపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఇప్పటికైనా పోలీసులు, అధికారులు స్పందించి ఆమె బిడ్డలకు కౌన్సెలింగ్ ఇవ్వడమో లేదా ఆ వృద్ధురాలికి తగిన ఆశ్రయం కల్పించడమో చేయాలని స్థానికులు వేడుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>