కలం, వెబ్ డెస్క్: ఎస్ఐఆర్ ( SIR) ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈ నెలాఖరులోగా 90 శాతం పురోగతి సాధించాలని కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్‌లోని సీఈఓ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల డీఈఓలు, ఈఆర్ఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ మేరకు ఆయన మాట్లాడారు.
మ్యాపింగ్ ప్రక్రియ సమర్థంగా నిర్వహించాలి
కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) కార్యక్రమాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో మ్యాపింగ్ ప్రక్రియను మరింత సమర్థంగా నిర్వహించాలని సూచించారు. గేటెడ్ కమ్యూనిటీలు, నివాస సంఘాలు, మురికివాడల్లో ప్రత్యేక దృష్టి పెట్టి ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బీఎల్ఓలు ప్రత్యక్షంగా సందర్శించి మ్యాపింగ్ చేపట్టాలని ఆదేశించారు. ఓటర్లకు సహాయం చేసేందుకు హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు సంబంధిత బీఎల్ఓలను సంప్రదించి స్వచ్ఛందంగా మ్యాపింగ్ పూర్తి చేసుకోవాలని తెలిపారు. స్వయం సహాయక బృందాలు, రేషన్ దుకాణాల డీలర్లు, ఉద్యోగ సంఘాలను కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలని కోరారు. మరణించిన వారు, వలస వెళ్లిన వారు, శాశ్వతంగా నివాసం మార్చుకున్న ఓటర్ల వివరాలను నిబంధనల ప్రకారం సరిదిద్దాలని అధికారులకు సూచించారు.
ఓటర్ల సమాచారం బయటకు పోవద్దు
వీవీఐపీ, వీఐపీ ఓటర్ల మ్యాపింగ్‌ను కూడా ప్రత్యేకంగా చేపట్టాలని పేర్కొన్నారు. ప్రతి బుధవారం రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి మ్యాపింగ్ పురోగతిని సమీక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు. బీఎల్ఓలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటర్ల సమాచారం లేదా ఓటీపీలను అనధికార వ్యక్తులతో పంచుకోవద్దని సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. అలాంటి ఘటనలు వెలుగులోకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తప్పుడు మ్యాపింగ్‌లను గుర్తించి వెంటనే సరిచేయాలని ఆదేశించారు. జిల్లాల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి, నోడల్ అధికారులు, సాంకేతిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

