కలం, తెలంగాణ బ్యూరో : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ మంత్రివర్గ విస్తరణ (Telangana Cabinet Reshuffle) ఉండొచ్చని గాంధీభవన్ వేదికగా చర్చ జరుగుతున్నది. కొద్దిమంది మంత్రుల శాఖలు మారొచ్చని, ఒకరిద్దరికి ఉద్వాసన తప్పదని, ముగ్గురికి కొత్తగా చోటు లభిస్తుందన్న మాటలూ వినిపిస్తున్నాయి. ఈ నెల థర్డ్ వీక్‌లో మంత్రివర్గంలో మార్పులు జరగాల్సి ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ డీలిమిటేషన్ బిల్లు హడావిడితో పక్కకు పోయిందని తెలంగాణ పీసీసీ నేతలు తెలిపారు. వచ్చే నెలలో మాత్రం సెకండ్ వీక్ తర్వాత దాదాపుగా ఉండొచ్చని సమాచారం. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే నెల 4న వెల్లడి కానున్నాయి. ఆ తర్వాత ఎప్పుడైనా సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ ఢిల్లీకి వెళ్ళి ఏఐసీసీ నేతలతో చర్చించి ఖరారు చేసే అవకాశమున్నది. ఆ తర్వాతే ముహూర్తం ఫిక్స్ అవుతుంది.
చాలాకాలంగా మంత్రివర్గ మార్పులపై చర్చ :
మంత్రివర్గంలో రెండు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వీటి కోసం చాలాకాలంగా ఆశావహులు పోటీపడుతున్నారు. సామాజికవర్గాలు, జిల్లాల సమీకరణాలతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బాలూనాయక్, ప్రేమ్‌సాగర్‌రావు, సుదర్శన్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి రాంమోహన్‌రెడ్డి, విజయశాంతి.. ఇలాంటివారి పేర్లు వినిపించాయి. కానీ ఇటు పీసీసీగానీ, అటు ఏఐసీసీగానీ ఎవ్వరిపైనా క్లారిటీ ఇవ్వలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలుమార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడూ మంత్రివర్గంలో మార్పులు గురించి ఏఐసీసీ పెద్దలతో చర్చించినట్లు వార్తలు వచ్చాయి. రెండున్నరేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈసారి మే నెలలో చివరి మార్పుగా క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ (Telangana Cabinet Reshuffle) ఉంటుందన్నది రాష్ట్ర పార్టీ వర్గాల సమాచారం. ఈ లోగానే కొన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా పూర్తవుతుంది. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ తదితరాలపైనా ప్రకటన వెలువడే అవకాశమున్నది.
Read Also: కార్పొ’రేట్’ వైద్యం.. తెలంగాణలో ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ
Follow Us On: WhatsApp

