కలం డెస్క్ : ఈసారి బడ్జెట్‌లో (Telangana Budget 2026) ఇండస్ట్రీస్, ఇరిగేషన్ రంగాలకు కేటాయింపులు పెరగనున్నాయి. ఇండస్ట్రీస్ శాఖ మొత్తంగా లక్ష కోట్ల కంటే ఎక్కువ కేటాయింపులు జరిగేలా ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఇరిగేషన్ శాఖ సైతం దాదాపు రూ. 80 వేల కోట్లకు పైగా ప్రపోజల్స్ తయారుచేసింది. ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్ని డిపార్టుమెంట్లతో సంక్రాంతి తర్వాత సమావేశం కానున్నారు. ఆయా శాఖలు సమర్పించే ప్రతిపాదనలపై చర్చించనున్నారు. రెండు శాఖలే దాదాపు రెండు లక్షల కోట్ల మేర ప్రతిపాదనలు సిద్ధం చేయడం గమనార్హం. గత బడ్జెట్‌లో చేసిన కేటాయింపులకు నాలుగు రెట్ల మేర ఎక్కువగా ఆశిస్తుండడంతో ఏ మేరకు ఆచరణ సాధ్యమనే చర్చ ఆ డిపార్టుమెంట్లలోనే జరుగుతున్నది. ఈ శాఖలు కోరుతున్నట్లుగా కేటాయింపులు జరగాలంటే రాష్ట్ర బడ్జెట్ సైజు సైతం కనీసంగా రెండున్నర, మూడు రెట్లు పెరగాల్సి ఉంటుంది. ఆ శాఖలు కోరినంత స్థాయిలో కేటాయింపులు ఉండకపోయినా గతంకంటే పెరగొచ్చనే భావన నెలకొన్నది.
పరిశ్రమల శాఖ అంచనా లక్ష కోట్లు :
పరిశ్రమల శాఖ రూపొందించిన ప్రతిపాదనల్లో రూ. 86 వేల కోట్లు డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ విభాగానికి ఇవ్వాలని కోరనున్నది. రాష్ట్రంలో చక్కెర పరిశ్రమల రంగానికి మరో రూ. 16 వేల కోట్ల కేటాయింపులు కోరుతూ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం, గ్లోబల్ సమ్మిట్ తదితర వేదికల కేంద్రంగా జరిగే, జరిగిన ఒప్పందాలకు అనుగుణంగా ఇండస్ట్రీస్ డిపార్టుమెంటు బడ్జెట్ కేటాయింపులు పెరగాలని భావిస్తున్నది. దేశ, విదేశీ కంపెనీల నుంచి పెట్టుబడులు రాబట్టేందుకు భూసేకరణ భారీగా అవసరమవుతుందని, అందుకు నిధులు కావాల్సి ఉంటుందన్నది ఆ శాఖ వర్గాల అభిప్రాయం. ఒకవైపు ఇప్పటికే కుదిరిన ఎంఓయూలను గ్రౌండింగ్ చేసేలా కసరత్తు చేస్తూనే రానున్న సంవత్సర కాలంలో బడ్జెట్ (Telangana Budget 2026) కేటాయింపుల్ని పెంచుకోవడం ద్వారా మరింత దూకుడు ప్రదర్శించవచ్చని ఆ శాఖ అంచనా.
తుమ్మిడిహట్టికి రూ. 11 వేల కోట్లు :
ఇరిగేషన్ డిపార్టుమెంటు పలు ప్రాజెక్టులను ఈ దఫాలోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. తమ్మిడిహట్టి దగ్గర నిర్మించే ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుకు రూ. 11,000 కోట్లు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు మూడున్నర వేల కోట్లు, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్సెల్బీసీ) టన్నెల్ పనులకు రూ. 6,300 కోట్లు కావాలని ప్రతిపాదనలు సిద్దం చేసింది. తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టును టేకప్ చేస్తామని, ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కూడా నిధులను కోరుతున్నందున ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతున్నది. గత బడ్జెట్లో నీటిపారుదల ప్రాజెక్టులకు రూ. 22 వేల కోట్లు కేటాయించినా ఈసారి అది దాదాపు లక్ష కోట్లకు పెంచేలా ప్రపోజల్స్ తయారుచేయడం గమనార్హం. గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులను, వడ్డీలను తీర్చడానికి కూడా కొంత ఉపయోగించాలనే ఉద్దేశంతో ఎక్కువ కేటాయింపుల్ని కోరుతున్నట్లు సమాచారం.
Read Also: ‘మున్సిపోల్స్’ బీసీ రిజర్వేషన్‌పై ఉత్కంఠ
Follow Us On: Sharechat


