కలం డెస్క్ : త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) బీసీ రిజర్వేషన్ల ఫార్ములాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. చట్టాన్ని రూపొందించింది. కానీ గవర్నర్ ఆమోదం రాలేదు. మరోవైపు రాజ్యాంగ సవరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. అక్కడ కూడా ఈ ప్రతిపాదనలు పెండింగ్‌లోనే ఉండిపోయాయి. దీంతో 42% రిజర్వేషన్ అమలుకు లీగల్ చిక్కులు ఏర్పడ్డాయి. ఫలితంగా పాత ఫార్ములా ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో కలిపి మొత్తం 50% దాటడానికి వీలు లేదు. దీంతో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% ఫార్ములా అమలుకాలేదు. పట్టణ స్థానిక సంస్థలకూ అదే రిపీట్ కానున్నది. ఈసారి మొత్తంగా 33%-34% మేరకు మాత్రమే బీసీ రిజర్వేషన్లు అమలయ్యే అవకాశమున్నది.
ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు :
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో (Municipal Elections) బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వర్లు నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి అందింది. ఏ మేరకు బీసీ రిజర్వేషన్లు (BC Reservations) సాధ్యమో అందులో వివరించింది. గత ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు బీసీలకు అందాయి. ఈసారి దానికంటే కాస్త తగ్గే అవకాశమే ఉన్నది. ఇందుకు కారణం, నగర శివారు ప్రాంతాల్లోని ఇరవై మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనం కావడమే. అవి విలీనం కావడంతో పట్టణ గ్రామీణ సంస్థల్లోని ఓటర్ల లెక్కల్లో తేడాలు రావడంతో బీసీ రిజర్వేషన్లు కూడా కనీసం ఒక శాతం తగ్గే అవకాశమున్నట్లు కమిషన్ వర్గాల సమాచారం. పార్టీల గుర్తుల ఆధారంగా అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతుండడంతో అఖిలపక్ష సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసి అన్ని పార్టీలూ 42% రిజర్వేషన్‌ను బీసీలకు ఇచ్చేలా ఒప్పించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే సమయంలో తగ్గడానికి అవకాశమున్నట్లు సంకేతాలు రావడం గమనార్హం.
Read Also: ప్రైవేటు భవనాల్లో ఆఫీసులు కుదరవ్
Follow Us On: X(Twitter)


