కలం డెస్క్ : ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో దాదాపు 15 వేల మంది బోగస్ ఔట్‌సోర్సింగ్ (Telangana Bogus Employees) ఉద్యోగులున్నట్లు ఇప్పటికి లెక్క తేలింది. ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి చివరినాటికి ఈ సంఖ్య మరింత పెరగనున్నది. దాదాపు 40 వేల మంది ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఆధార్ కార్డు వివరాలను సేకరిస్తూ బోగస్ ఎంప్లాయీస్ గుర్తింపు, ఏరివేతపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పూర్తి వివరాలు మరో మూడు నెలల తర్వాత స్పష్టం కానున్నాయి. బోగస్ ఉద్యోగులు ఇంతకాలం ఖజానా నుంచి వేతనాల రూపంలో పొందిన డబ్బును రికవరీ చేయడంపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని, ఏజెన్సీలపై అవసరమైన చర్యలు చేపట్టడంపైనా క్యాబినెట్‌లో చర్చ అనంతరం ఖరారవుతుందని ఆర్థిక శాఖ వ్యవహారాలను చూస్తున్న ఓ సీనియర్ అధికారి తెలిపారు.
రాష్ట్ర ఆదాయం పెరుగుతూ ఉన్నది :
రాష్ట్ర సొంత ఆదాయం క్రమంగా పెరుగుతూ ఉన్నదని, రానున్న రోజుల్లో ఇది మరింత ఊపందుకుంటుందని ఆ అధికారి వివరించారు. ఉదాహరణకు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విభాగం ఆదాయం 10% నుంచి 12% మేర పెరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న ఫోర్త్ సిటీ ప్రభావం కారణం కొంత మేరకు ఉండొచ్చన్నారు. ఫోర్త్ సిటీ వైపు భూలావాదేవీలు పెరిగాయని, త్వరలోనే రిజిస్ట్రేషన్ల గణాంకాలతో పాటు ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం లెక్కలు తెలుస్తాయన్నారు. మైనింగ్ శాఖ ఆదాయం కూడా దాదాపు 25% మేర పెరిగిందన్నారు. ఇందుకు ఇళ్ల నిర్మాణం పెరగడంతో ఇసుకకు డిమాండ్ ఏర్పడడం ఒక కారణమన్నారు. అదే సమయంలో ఇసుక రవాణాలో ఇంతకాలం జరిగిన అవకతవకలను అరికట్టడం కూడా మరో కారణమన్నారు.
గాడిలో పడ్డ ఆర్థిక వ్యవస్థ :
మద్యం ద్వారా రాష్ట్రానికి ఎక్సైజ్, వ్యాట్ పన్నుల రూపంలో సమకూరుతున్న ఆదాయం తొమ్మిది నెలలుగా స్థిరంగానే ఉన్నదని, ఇయర్ ఎండింగ్, వీకెండ్స్ లో కొంత పెరుగుతుందన్నారు. స్వీయ ఆర్థిక వనరులను పెంచడంపై ఫోకస్ పెట్టడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిందన్నారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఉద్యోగుల పెండింగ్ బిల్లుల బకాయిలను చెల్లించగలిగే స్థితికి చేరుకున్నామన్నారు. పెళ్లిళ్లు, ఇతర అత్యవసరాలు ఉన్న ఉద్యోగుల చెల్లింపుల్లో కేవలం 10% డివియేషన్ మాత్రమే ఉన్నదని, మిగిలిన 90% చెల్లింపులు సీరియల్ నెంబర్ల ఆధారంగానే జరిగిపోతున్నాయన్నారు. ఎంప్లాయీస్ మెడికల్ బిల్లులను సైతం ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నామని, గ్రీన్ ఛానెల్ ద్వారా పేమెంట్స్ జరుగుతుండడంతో జీరో పెండెన్సీ నమోదైందన్నారు.
కాంట్రాక్టర్ల బిల్లుల పేమెంట్ సైతం :
వివిధ రకాల అభివృద్ధి పనులు చేసిన వర్క్ ఏజెన్సీ కాంట్రాక్టర్ల పెండింగ్ విషయంలోనూ ‘ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ బేసిస్’ పద్ధతిని అమలు చేస్తున్నామన్నారు. ఆర్ అండ్ బీ, ఇతర శాఖల్లో రూ. 5 లక్షల మొదలు కోటి రూపాయల వరకున్న చిన్న బిల్లుల పేమెంట్లను ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేకుండానే చేస్తున్నామన్నారు. డిసెంబరులో దాదాపు రూ. 100 కోట్లకు పైగా చిన్న చిన్న బిల్లుల్ని క్లియర్ చేసినట్లు తెలిపారు. రానున్న (2026-27) ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కోసం కసరత్తు ప్రారంభమైందని, ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం సమర్పించే బడ్జెట్‌లో రాష్ట్రానికి వచ్చిన కేటాయింపుల్ని చూసి స్టేట్ బడ్జెట్‌ను ఫైనలైజ్ చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు రాష్ట్రాలకు రిలీజ్ అయ్యే నిధుల్లో ఇంతకాలం చాలా జాప్యం జరిగేదని, కారణాలను అన్వేషించి దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో పెండెన్సీ ఇక ఒక చరిత్రగానే ఉండిపోతుందన్నారు.

Read Also: 40 ఏళ్ల అనుభవం ఉంది.. కానీ సభకు రారు: సీఎం రేవంత్
Follow Us On : WhatsApp


