కలం, వెబ్ డెస్క్: పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య (Tejasvi Surya) తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. తెలంగాణ నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు తేజస్వీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో భారత్ నుంచి పాకిస్థాన్‌ను విభజించినట్లు ఏపీ, తెలంగాణల విభజన జరిగిందని తేజస్వీ వ్యాఖ్యానించారు. ఈ విభజన అశాస్త్రీయంగా జరిగిందని, కాంగ్రెస్ అన్యాయం చేసిందని తేజస్వీ అన్నారు. దీనిపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ బీజేపీకి విద్వేషాలు రెచ్చగొట్టడం అలవాటేనని, తేజస్వీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జాగృతి చీఫ్ కవిత తదితరులు తేజస్వీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. బీజేపీ ఎంపీలు తేజస్వీ వ్యాఖ్యలపై స్పందించాలని, దీన్ని బహిరంగంగా ఖండించాలని డిమాండ్ చేశారు. తేజస్వీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) స్పందించారు. తేజస్వీ తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్‌తో పోల్చలేదని ఆయన పేర్కొన్నారు. భారత్, పాక్ విభజన సమయంలో ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని, అదే రీతిలో తెలంగాణ నిర్మాణం జరిగిందని, ఇక్కడ కూడా ఎంతోమంది ప్రాణ త్యాగం చేశారని చెప్పారన్నారు. బీజేపీ ఒక్క ప్రాణం కూడా నష్టపోకుండా మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసిందని, కాంగ్రెస్ ఎందుకు చేయలేకపోయిందని ప్రశ్నించారని వివరించారు. తేజస్వీ మాట్లాడిన సందర్భం, ఆయన ఆలోచనను చూడాలి కానీ తప్పులు వెతకొద్దని సూచించారు.

