కలం, వెబ్ డెస్క్: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender)కు వ్యతిరేకంగా జరుగుతున్న ఫ్లెక్సీ రాజకీయంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramchander Rao) స్పందించారు. కొంత మంది ఈటల మీద కొన్ని అభియోగాలతో సికింద్రాబాద్, మల్కాజిగిరిల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టారన్నారు. ఈ పని బీజేపీ వ్యతిరేక శక్తులే చేశారని ఆరోపించారు. బీజేపీలో ఐక్యత స్పష్టంగా కనిపిస్తుందదని, పార్టీ మరింత బలంగా ఎదుగుతోందని రామచందర్ రావు స్పష్టం చేశారు. ఎదురుగా వచ్చి రాజకీయం చేయలేని చిల్లర వ్యక్తులే ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. దీనిపై డీజీపీ, మల్కాజిగిరి, సైబరాబాద్ కమిషనరేట్లలో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీనిపై తప్పకుండా దర్యాప్తు జరగాలని, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అసలు ఏం జరిగిందంటే…
ఆదివారం రోజు మేడ్చల్ జిల్లా ఓఆర్ఆర్ వద్ద, సికింద్రాబాద్‌లో ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా కొన్ని ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీల్లో ఈటలపై వివాదాస్పద వ్యాఖ్యలు రాసి ఉన్నాయి. “నీ ఏడుపే బీజేపీకి శాపం” అంటూ, అసలు బీజేపీలోకి వచ్చి పార్టీకి ఏం చేశావంటూ ఫ్లెక్సీల్లో రాశారు. ఇది తెలంగాణ బీజేపీలో తీవ్ర చర్చకు దారి తీసింది. సొంత పార్టీలోనే ఈటలను వ్యతిరేకించే వారు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని కొందరు ఆరోపిస్తుండగా.. బీజేపీ వ్యతిరేక శక్తులే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయని రామచందర్ రావు చెప్పుకొస్తున్నారు.

