కలం, మహబూబ్ నగర్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా ఆటో కార్మికులకు 12 వేల ఆర్థికసాయం అందించాలని ఏఐటీయూసీ (AITUC) మహబూబ్‌నగర్ జిల్లా కార్యదర్శి పీ సురేష్ డిమాండ్ చేశారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సం నుంచే ఈ హామీ అమలు చేయాలని కోరారు. ఆదివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని న్యూటన్, న్యూబస్టాండ్, రైల్వేస్టేషన్, మెట్టుగడ్డ తదితర ప్రాంతాల్లోని ఆటోస్టాండ్‌ల దగ్గర ఆటో కార్మికులతో సంతకాల సేకరణ ఉద్యమం ప్రారంభించారు.
ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి
ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఆటో డ్రైవర్‌కు 12,000 ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆటో కార్మికుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, సింగల్ పర్మిట్ పాలసీ, ట్రాఫిక్ చలాన్ల రాయితీ, ప్రమాదబీమా లాంటి అనేక వాగ్దానాలు చేసి ఆటో కార్మికుల ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 30 నెలలు గడుస్తున్నా అమలులో మాత్రం తీవ్రమైన అలసత్వం ప్రదర్శిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
లక్షల మంది కార్మికులకు జీవనాధారం
ఆటోరంగంపై లక్షలాదిమంది కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకంతో ఆటో కార్మికులు తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొంటున్నారని అన్నారు. తగిన ఉపాధి అవకాశాలు లేక పేద కుటుంబాల నిరుపేద యువకులు ఈఎంఐ ద్వారా ఆటోలు కొనుగోలు, అద్దె ఆటోలు నడుపుతున్న ఆటో కార్మికులకు ప్రయాణికులు లేక అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారని పేర్కొన్నారు.
94 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి 94 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలతో ఆటో కార్మికుల జీవన విధానం ధ్వంసం అవుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఓలా, ఉబర్ సంస్థల నుండి రక్షణ, నియంత్రణ కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. లేదంటే ఆటో కార్మికుల ఆందోళనలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, ఏఐటీయూసీ ఆటో యూనియన్ నాయకులు అర్జున్, అంజి, ఖాజా, భీముడు, సాయిలు, రాజు, గిరి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

