కలం, ఖమ్మం బ్యూరో: సింగరేణి కాలరీస్ సంస్థ కార్మిక సంక్షేమంలో దేశంలోనే ఎన్నడూ లేని విధంగా ఒక చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. ప్రమాదాల వల్ల కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థికంగా ఛిన్నాభిన్నమయ్యే కార్మిక కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవ నేడు దేశవ్యాప్తంగా బీమా రంగంలోనే ఒక విప్లవాత్మక మార్పునకు దారితీసింది. రూపాయి ప్రీమియం భారం కూడా లేకుండా, కేవలం బ్యాంక్ శాలరీ ఖాతాల అనుసంధానంతో ఉద్యోగులకు గరిష్టంగా ఒక కోటి రూపాయల నుండి 1.25 కోట్ల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా (Singareni Free Accident Insurance)ను అందిస్తూ సింగరేణి యాజమాన్యం సరికొత్త చరిత్రను లిఖించింది. గత రెండేళ్లుగా అమలవుతున్న ఈ పథకం ద్వారా ఇప్పటికే వివిధ ప్రమాదాల్లో మరణించిన సుమారు 45 కార్మిక కుటుంబాల్లో వెలుగులు నిండాయి.
40,275 మంది ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయం..
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న 40,275 మంది ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, వారు జీతాలు పొందే వివిధ బ్యాంకులతో యాజమాన్యం ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకుల్లో శాలరీ ఖాతాలున్న వారికి ఒక కోటి రూపాయల ప్రమాద బీమా లభిస్తుండగా… పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుల్లో కార్పొరేట్ ఖాతాలున్న వారికి గరిష్టంగా 1.25 కోట్ల రూపాయల ప్రమాద బీమా అందుతోంది. ఈ పథకం కేవలం మరణానికే పరిమితం కాకుండా, గని ప్రమాదాల్లో లేదా ఇతరత్రా జరిగే దుర్ఘటనల్లో కాళ్లు, చేతులు కోల్పోయి పాక్షిక లేదా శాశ్వత అంగవైకల్యానికి గురైన వారికి కూడా పూర్తి స్థాయిలో వర్తిస్తుండటం విశేషం.
ఇటీవల శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన కార్మికుడు సత్యనారాయణ గని ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోగా, ఈ పథకం కింద ఆ కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయం అందించి యాజమాన్యం ఆదుకుంది. ఈ సంక్షేమ పథకం అంధకారమైన కుటుంబాలకు ఏ విధంగా దిక్సూచిగా మారిందో చెప్పడానికి నాగుల రాజయ్య, పెండ్రి లత వంటి వారి జీవితాలే ప్రత్యక్ష ఉదాహరణలు. కారుణ్య నియామకం ద్వారా సింగరేణిలో చేరిన కేవలం 18 నెలలకే రోడ్డు ప్రమాదంలో మరణించిన సంతోష్ అనే యువకుడి తండ్రి నాగుల రాజయ్య తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. సర్వీస్ తక్కువగా ఉండటం వల్ల వచ్చే టర్మినల్ బెనిఫిట్స్ చాలా స్వల్పంగా ఉన్న ఆ కుటుంబానికి, ఈ కోటి రూపాయల ఉచిత ప్రమాద బీమా పథకమే ఒక పెద్ద కొడుకులా ఆర్థిక భరోసానిచ్చింది. అలాగే, పుట్టిన నెల రోజుల పసికందును చూసి వస్తూ ప్రమాదవశాత్తు మరణించిన రంజిత్ కుమార్ భార్య పెండ్రి లతకు, ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు స్వయంగా ఒక కోటి రూపాయల బీమా చెక్కును అందజేశారు. తన భర్తను తిరిగి తీసుకురాలేకపోయినా, ఆయన నెరవేర్చాల్సిన బాధ్యతలను, కొడుకు భవిష్యత్తును తీర్చడానికి ఈ సొమ్ము ఎంతో ఆసరాగా నిలిచిందని లత కన్నీటి పర్యంతమయ్యారు.
30 వేల మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది విస్తరణ..
ఈ పథకం పరిధి కేవలం శాశ్వత ఉద్యోగులకే కాకుండా సంస్థలో పనిచేస్తున్న దాదాపు 30 వేల మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా విస్తరించడం రాష్ట్ర ప్రభుత్వ కార్మిక పక్షపాత వైఖరికి నిదర్శనం. పొరుగు సేవల సిబ్బంది కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా 40 లక్షలు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ద్వారా 30 లక్షల రూపాయల ప్రమాద బీమాను కల్పించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎస్టీపీపీకి చెందిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి కంబాల రాజేష్ కుటుంబానికి దీని ద్వారా 50 లక్షల రూపాయల బీమా సొమ్ము అందింది. దీనికి అదనంగా, ఉద్యోగుల వృద్ధాప్య జీవితానికి రక్షణగా వారు 61 ఏళ్లకు పదవీ విరమణ పొందాక కూడా సదరు బ్యాంకుల్లో పెన్షన్ ఖాతా కలిగి ఉంటే 30 లక్షల నుండి ఒక కోటి రూపాయల వరకు ఉచిత బీమా వర్తించేలా ఒప్పందాలు కుదిరాయి.
జీవిత భద్రతతో పాటు కార్మికుల ఆరోగ్య భద్రత కోసం ఎస్‌బీఐ సహకారంతో ఏడాదికి కేవలం 8,906 రూపాయల నామమాత్రపు ప్రీమియంతో 50 లక్షల రూపాయల భారీ కార్పొరేట్ ఆరోగ్య బీమా పథకాన్ని కూడా తాజాగా అందుబాటులోకి తెచ్చారు. ఇది ఉద్యోగితో పాటు వారి జీవిత భాగస్వామికి, 25 ఏళ్ల లోపు ఇద్దరు పిల్లలకు 63 ఏళ్ల వయస్సు వరకు వర్తిస్తుంది. కేవలం ప్రమాద బీమాకే కాకుండా, ఎటువంటి ప్రీమియం లేకుండా 10 లక్షల నుండి 15 లక్షల రూపాయల వరకు ఉచిత సహజ మరణ బీమాను కూడా బ్యాంకులు అందిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కల చొరవతో సింగరేణిలో ప్రారంభమైన ఈ ఉచిత బీమా నమూనా… ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని విద్యుత్ సంస్థలకు, ప్రభుత్వ శాఖలకు విస్తరించి, నేడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం వర్తింపజేసేలా దేశానికే ఒక రోల్ మోడల్‌గా నిలిచింది. ఇప్పటివరకు సింగరేణి పరిధిలోనే వివిధ బ్యాంకుల ద్వారా దాదాపు 41 కోట్ల రూపాయల బీమా సొమ్ము బాధితులకు చెల్లించబడటం గమనార్హం.

