Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణను వ్యతిరేకిస్తే.. మూల్యం చెల్లించాల్సిందేనా?

కలం, తెలంగాణ బ్యూరో:

ఆరు దశాబ్దాల ఆకాంక్ష..
వెయ్యి మందికిపైగా ప్రాణత్యాగం…

గల్లీ నుంచి ఢిల్లీ వరకు అలుపెరుగని పోరాటం.. ఎట్టకేలకు సాకారమైన తెలంగాణ (Telangana) రాష్ట్రం! తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచిన, వ్యతిరేకించిన పార్టీలకు ఈ గడ్డపై నూకలు చెల్లాయి. వాటి ఉనికే ప్రశ్నార్థకమైంది. ఎన్నికల్లో భూస్థాపితమయ్యాయి. ఎప్పటికీ ఇక్కడ మొలకెత్తవనే భావన ఏర్పడింది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాతా కొన్ని పార్టీలు రాష్ట్ర ఏర్పాటుపై విషం చిమ్ముతూనే ఉన్నాయి. విద్వేషపూరిత మాటలు, పోరాటాన్ని అవమానించే కామెంట్లు చేస్తూనే ఉన్నాయి.

నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పటి నుంచి తెలంగాణ ఏర్పాటు విధానాన్ని తప్పుపడుతూనే ఉన్నారు. ‘తల్లిని చంపి బిడ్డను బయటకు తీశారు’ అంటూ పార్లమెంట్ సాక్షిగా కామెంట్లు చేశారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడటాన్ని స్వాగతిస్తున్నామని చెప్తూనే నెగెటివ్ కామెంట్లు చేశారు. అమిత్ షా సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తాజాగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోల్చారు. ఆయన లోక్‌సభ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమశక్తుల్ని మరోమారు ఏకం చేస్తున్నాయి. బీజేపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే విషం చిమ్ముతున్నారన్న అభిప్రాయం నెలకొన్నది.

ఉద్యమాన్ని వ్యతిరేకించారన్న కారణంతో నాడు వైఎస్సార్‌‌సీపీ అధినేత జగన్‌ను మానుకోటకు రాకుండా తెలంగాణ ఉద్యమకారులు అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆయన పార్టీకి తెలంగాణలో భవిష్యత్తే లేకుండా పోయింది. ‘రెండు కండ్ల సిద్ధాంతం’ పేరిట తెలంగాణ మీద కక్ష కట్టారనే భావనతో చంద్రబాబును, ఆయన పార్టీ టీడీపీని ఇక్కడి ప్రజలు తిరస్కరించారు. తెలంగాణలో పోటీ చేసినా డిపాజిట్ సైతం రావట్లేదు. ‘ప్రజారాజ్యం’ అంటూ రాజకీయ తెరంగేట్రం చేసిన చిరంజీవి సమైక్యాంధ్ర జెండా పట్టుకోగానే తెలంగాణ ప్రజలు “ఇక్కడ మీ అవసరం లేదు” అంటూ ఆ పార్టీని సాగనంపారు.

ఒకప్పుడు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు ‘జై తెలంగాణ’ అంటూ నినదించిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటు విధానంపై ఇష్టమున్నట్లు మాట్లాడారు. ఆ మధ్య ‘కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ దిష్టి తగిలిందేమో’ అంటూ కామెంట్లు చేశారు. తెలంగాణను అవమానించిన పవన్ పార్టీ జనసేనకు రాజకీయంగా ఇక్కడ అవకాశమే లేకుండా పోయింది. బీజేపీ జాతీయ నేతలు సైతం తెలంగాణ వ్యతిరేక కామెంట్లు చేస్తున్నారు. తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ లీడర్లు ఖండించకపోగా సమర్థించేలా మాట్లాడుతున్నారని తెలంగాణ ఉద్యమకారులు మండిపడుతున్నారు.

తెలంగాణ ఏర్పడి పుష్కరకాలం దాటుతున్నా విద్వేషపు మాటలు ఆగడం లేదు. తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ జగన్ ఏపీకి సీఎం కాగానే ప్రగతి భవన్‌కు పిలిపించుకొని రాచమర్యాదలు చేశారన్న కోపంతో కేసీఆర్‌పైనా తెలంగాణ ప్రజలు ఓట్ల రూపంలో ఆగ్రహాన్ని ప్రదర్శించారు. దీంతో బీఆర్ఎస్ ప్రతిపక్షానికే పరిమితమైంది. తెలంగాణ ఏర్పాటు విధానంపై ఇంకా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న నేతలకు తెలంగాణ ప్రజలు ఎలాంటి గుణపాఠం చెప్తారన్నదే ఆసక్తికరం. వీటన్నింటిపై కలం ప్రత్యేక కథనం చదివేందుకు కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Telangana
Telangana

Read Also: అనుకున్నదొక్కటి.. మోడీ ప్లాన్ ఢమాల్..

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>