నేడు కేసీఆర్ భారీ సభ.. బీఆర్ఎస్‌లో చేరనున్న జీవన్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: జగిత్యాలలో సోమవారం బీఆర్ఎస్ నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద భారీ బహిరంగ సభ (KCR public meeting)కు సర్వం సిద్ధమైంది. నేడు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రానుండటంతో పాటుగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరనుడటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధికార కాంగ్రెస్‌పై పోరు మార్గానికి బీఆర్ఎస్ ఈ సభ ద్వారా సమరశంఖం పూరించబోతుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. పార్టీ జండాలు, భారీ కట్ అవుట్‌లతో జగిత్యాల గులాబీమయమైంది. చాలా కాలం తరువాత కేసీఆర్ ప్రసంగించనుండటంతో ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. ఈ సభకు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనాయకులు సభలో పాల్గొననున్నారు.

పది ఎకరాల విస్టీర్ణంలో సభ..

రేవంత్ సర్కార్ వైఫల్యాలపై, దేశ రాజకీయాలపై కేసీఆర్ చేసే వ్యాఖ్యలపై అందరూ ఎదురుచూస్తున్నారు. తమ బాస్ సభకు రానుండటంతో ఇప్పటికే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు సభ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభకు ఎలాంటి ఆటంకం కలుగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. సభ నిర్వహణ, జన సమీకరణ వంటి అంశాలను నియోజకవర్గాల్లో పర్యవేక్షించడానికి ఎక్కడికక్కడ ఇన్‌చార్జులను నియమించారు. మరోవైపు వేదిక వద్ద ఏర్పాట్లు, సభా స్థలి వద్ద ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు పలువురు నాయకులకు బాధ్యతలు అప్పగించారు. జగిత్యాల సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్న బీఆర్‌ఎస్‌ నాయకులు వారం రోజులుగా శ్రమిస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పది ఎకరాల విస్తీర్ణంలో షామియానాలు, సభా ప్రాంగణంలో కుర్చీలు ఏర్పాటు చేశారు. సభకు సుమారు లక్ష మందిని తరలించేలా బీఆర్ఎస్ పార్టీ కృషిచేస్తోంది.

బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి..

ఇక నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం కలిగిన సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరనుండటంతో తెలంగాణ రాజకీయం రసవత్తరంగా సాగనుంది. కాంగ్రెస్ హయాంలో జగిత్యాల కేంద్రంగా విశేష సేవలు అందించిన జీవన్ రెడ్డి.. గులాబీ తీర్థం పుచ్చుకొని రేవంత్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టనున్నారు. ఎన్నో విప్లవాత్మక ఉద్యమాలకు వేదికైన జగిత్యాల గడ్డ నుంచి మరో పోరుకు జీవన్ రెడ్డి సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న తీరు, కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను సహించలేక ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజకీయ పార్టీల్లో సుదీర్ఘ ప్రస్థానం కలిగిన సీనియర్ నేతలు కేసీఆర్, జీవన్ రెడ్డి ఒకే వేదిక పంచుకోనుండటంతో అటు గులాబీ శ్రేణులు, జీవన్ రెడ్డి అనుచర వర్గం హర్షం వ్యక్తం చేస్తోంది.

బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..

కేసీఆర్ స్పీచ్ యావత్తు తెలంగాణ సమాజానికి ఉత్సాహాన్ని ఇస్తుందని, తమలో సైతం ప్రేరణ కలిగిస్తోందని బీఆర్ఎస్ శ్రేణులు ఆనందపడుతున్నారు. అటు ఆయన చేయబోయే ప్రసంగంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొన్నది. కేసీఆర్ సభకు వచ్చిన వారికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పార్టీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. గతేడాది ఏప్రిల్‌ 27న వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ రజతోత్సవ ప్లీనరీ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్‌.. తదుపరి రాజకీయ పరంగా నిర్వహిస్తున్న సభలో సోమవారం పాల్గొంటున్నారు. దీంతో కేసీఆర్‌ ఇచ్చే దిశానిర్దేశం కోసం పార్టీ శ్రేణులు వేచి చూస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>