జంతర్ మంతర్ ఘటనపై ఎస్ఎఫ్ఐ ఫైర్

కలం, కరీంనగర్ : నేడు భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) జాతీయ కమిటీ పిలుపులో భాగంగా నగరంలోని ఆర్ట్స్ కళాశాల నుంచి తెలంగాణ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగరపు రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలపై దేశవ్యాప్తంగా యువత, విద్యార్థులు ఉద్యమిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిరసనలను అణిచివేయడానికి ప్రయత్నించడం ఆందోళనకరమని అన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యాన్‌లు  ప్రయోగించడం, లాఠీచార్జ్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.

దేశంలో విద్యా వ్యవస్థ నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించిన రజనీకాంత్, వరుసగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకత్వం తగిన విధంగా స్పందించడం లేదని అన్నారు. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూసే బీజేపీ నాయకులు, విద్యార్థుల ప్రాణాలకు సంబంధించిన సమస్యలపై ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు. విద్యా వ్యవస్థను కేంద్రీకరిస్తూ రాష్ట్రాల హక్కులను హరిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అలాగే, పార్లమెంట్ వైపు శాంతియుతంగా వెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులను బారికేడ్లతో అడ్డుకుని.. పోలీసులు, సివిల్ దుస్తుల్లో ఉన్న కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా కొట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ పరిణామాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోందని తెలిపారు.

జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజ్యాంగ హక్కులను హరిస్తూ ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు ఈ అంశంపై స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విద్యార్థులపై వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులను ప్రభావితం చేసిన NEET పరీక్షలో జరిగిన అవకతవకలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

విద్యార్థులను, యువతను రెచ్చగొట్టే రాజకీయాల కంటే దేశ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే చర్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణకు చెందిన బీజేపీ ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి, NEET పరీక్షలో నష్టపోయిన విద్యార్థులందరికీ న్యాయం చేయడంతో పాటు, నిరసనలో గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కంపెళ్లి అరవింద్, జిల్లా ఉపాధ్యక్షులు వినయ్, ఇసాక్, సహాయ కార్యదర్శి గట్టు ఆకాశ్, గర్ల్స్ కన్వీనర్ మానస, జిల్లా కమిటీ సభ్యులు రోహిత్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: సోనమ్ వాంగ్‌చుక్‌‌ ట్రీట్‌మెంట్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>