కలం, వెబ్‌డెస్క్: మహానాడు (Mahanadu) కార్యక్రమంలో టీడీపీ నేతలు బిజీబిజీగా గడుపుతున్న సమయంలో అనంతపురం (Anantapur) టీడీపీలో సంచలన ఘటన చోటు చేసుకుంది. సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందంటూ మరో టీడీపీ నాయకుడు వీడియోను విడుదల చేశారు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ (MLA Daggubati Prasad) నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ స్థానిక టీడీపీ నేత సైఫుద్దీన్ (Saifuddin) ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని, జిల్లాలో కష్ట కాలంలో పార్టీని భుజాన వేసుకొని ముందుకు నడిపించానని ఆయన చెప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తనను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ విషయం గురించైనా ప్రశ్నిస్తే తనను సస్పెండ్ చేస్తామని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అంటున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడ్డ వారిని పక్కన పెట్టేశారని సైఫుద్దీన్ చెప్పుకొచ్చారు.
ఎమ్మెల్యే ప్రసాద్‌తో, అతడి అనుచరులతో ప్రాణహాని ఉందని చంద్రబాబు, లోకేశ్‌కు వీడియోలో విన్నవించుకున్నారు. తనకు సంబంధించి జిల్లాలో ఒక్క పని కూడా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడ్డందుకు సస్పెండ్ చేస్తారా? అని సైఫుద్దీన్ (Saifuddin) ప్రశ్నించారు. కనీసం చిన్న పనులు కూడా జరగడం లేదని, ఓ నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడ్డందుకు ఇచ్చే గుర్తింపు ఇదేనా? అని నిలదీశారు. తనకు ఏమైనా జరిగితే ఎమ్మెల్యే, ఆయన అనుచరులే కారణమని సైఫుద్దీన్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వైసీపీ వాళ్లను వెనకేసుకొని తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు. ఇవన్నీ ప్రశ్నించినందుకు తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని, తనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ అండగా ఉండాలని కోరారు.
Read Also: హై అలర్ట్ .. ఏపీకి తీవ్ర వడగాల్పుల హెచ్చరిక
Follow Us On: X(Twitter)

