కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : వనపర్తి (Wanaparthy) జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల భారంతో ఓ కుటుంబం మొత్తం బలైన ఘటన ఖిల్లా గణపురం (Khilla Ghanpur) మండలం సలికెలాపూర్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు గ్రామానికి చెందిన గంగల నరసింహులు(40) తన భార్య ఎల్లమ్మ(36), కుమారుడు సాయి నిహాల్(15), కుమార్తె సాహితీ శ్రీ(13)తో కలిసి గత ఆరు సంవత్సరాలుగా మామిడి తోటలను లీజుకు తీసుకుని వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంలో నష్టాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా రూ. 60 నుంచి 70 లక్షల వరకు అప్పులు చేసినట్లు సమాచారం. కొన్ని అప్పులపై కోర్టు కేసులు కూడా నడుస్తున్నట్లు తెలిసింది.
అప్పుల బాధలు ఎక్కువ కావడంతో నరసింహులు భార్య, కూతురును తాము నివాసం ఉంటున్న సలికెలాపూర్ మామిడి తోటలో హతమార్చి నీటి సంపులో వేశాడు. పరిస్థితి గమనించిన కుమారుడు పారిపోయే ప్రయత్నం చేసినా కాళ్లు చేతులు కట్టివేసి సంపులో వేశాడు. అనంతరం బుధవారం తెల్లవారుజామున ఒకటిన్నర గంటల ప్రాంతంలో తన బావమరిది వెంకటేష్‌కు ఫోన్ చేసి అప్పుల బాధ భరించలేకపోతున్నాం.. మీ అక్క, కోడలు, అల్లుడిని చంపి వేశాను. నేను కూడా ఉరి వేసుకుంటున్నాను . అని తెలియజేసి ఆత్మహత్య చేసుకున్నాడు.. సమాచారం అందుకున్న ఖిల్లా గణపురం (Khilla Ghanpur) పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Read Also: భారత క్రీడా దిగ్గజం రంధీర్ సింగ్ కన్నుమూత
Read Also: డిజిటల్ విప్లవం

