కలం, వెబ్ డెస్క్ : కోనసీమ జిల్లా పి.గన్నవరం (P Gannavaram)లో కూటమి పార్టీల మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వేదికగా తెలుగుదేశం, జనసేన (TDP – Janasena) నాయకులు బాహాబాహీకి దిగడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డ్వాక్రా యానిమేటర్లకు సెల్‌ఫోన్ల పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ వివాదం చోటు చేసుకుంది. కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడమే ఈ గొడవకు ప్రధాన కారణమైంది.
ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫొటోను విస్మరించడంపై జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సమక్షంలోనే ఆ ఫ్లెక్సీని వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య మాటల యుద్ధం కాస్తా తోపులాటకు దారితీసింది. ఎమ్మెల్యే సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ, తమ నాయకుడికి ప్రోటోకాల్ ప్రకారం గౌరవం ఇవ్వడం లేదని జనసేన శ్రేణులు నిరసనకు దిగాయి. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇలాంటి ఘటనలు జరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Also: సింగపూర్‌లో పర్యటించిన ఏపీ మంత్రుల బృందం
Follow Us On : WhatsApp

