Mobile Popup Ad
Mobile Popup Ad

రమ్మంటున్న కేటీఆర్.. రానంటున్న కేసీఆర్!

కలం, తెలంగాణ బ్యూరో: గత కొన్ని నెలలుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ‘నెరేటివ్‌’ను తెరమీదికి తెస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రెండేండ్లు పూర్తయిన సందర్భంగా గతేడాది డిసెంబర్ నుంచి జనం మెదళ్లలో రిజిస్టర్ అయ్యేలా దీన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. “ప్రజలు కాంగ్రెస్ పాలనపై విసిగిపోయారు.. కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకుంటున్నారు.. 2028లో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారు.. రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి” ఈ లైన్‌లోనే దాదాపు ప్రతీ సమావేశంలో కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. రాష్ట్రాన్ని పరిపాలించడం కాంగ్రెస్‌కు చేతకావడం లేదని, తాము ఓడిపోవడం ఒకందుకు మంచిదే అయిందని, కేసీఆర్ (KCR) విలువ ప్రజలకు ఇప్పుడు తెలిసి వచ్చిందని, ఆయన పాలన మళ్లీ రావాలని చెప్తున్నారు. కేసీఆర్‌కు తోడు ఆయన బావ హరీశ్ రావు కూడా ‘‘కేసీఆర్ రావాలి.. ఆయన పాలన రావాలి” అంటూ ప్రజల మధ్య నుంచి పదే పదే పిలుపునిస్తున్నారు.

వాళ్లు అలా అంటున్నా.. కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ ను విడిచి బయటకు అడుగుపెట్టడం లేదు. అధికారం కోల్పోయి.. ప్రతిపక్ష నేతగా మారినప్పటి నుంచి ఓ నాలుగైదు సార్లు.. అందులో రెండుసార్లు అసెంబ్లీకి అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. ఓసారి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కోసం హైదరాబాద్ నందినగర్ లో అందుబాటులో ఉన్నారు. రెండున్నరేండ్ల నుంచి కనీసం సొంత సెగ్మెంట్ గజ్వేల్ ప్రజల దగ్గరకు వెళ్లి కూడా కలవడం లేదన్న విమర్శలను కేసీఆర్ మూటగట్టుకున్నారు.

‘‘కేసీఆర్ రావాలి.. ఆయన పాలన కావాలి.. చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిండు” అని కొన్నిరోజులుగా కేటీఆర్ రిపీట్ చేయడం.. కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ కే పరిమితమవడం పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్‌గా మారింది. సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలోనూ కేటీఆర్ ఇలాంటి కామెంట్లే చేశారు. ఇది కేవలం కేసీఆర్‌ను పొగడటం కాదని, రాబోయే ఎన్నికల్లో లబ్ధి కోసం వ్యూహాత్మకంగానే ఆ పార్టీ ఎంచుకున్న ఎత్తుగడ అనేది కొందరు పొలిటీషియన్ల వాదన.

తెలంగాణ పరిపాలనలో కేసీఆర్‌ మాత్రమే సమర్థుడన్నట్లుగా, ఆయనే ప్రత్యామ్నాయ నాయకుడన్నట్లుగా మెసేజ్ ఇవ్వడానికి కేటీఆర్ ఈ కామెంట్లు చేస్తున్నారన్నది వారి అభిప్రాయం. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ రాజకీయంగా ఎక్కువగా ప్రజల్లో కనిపించలేదు. దీంతో ఆయనపై నెలకొన్న ప్రతికూల అభిప్రాయాన్ని మార్చేందుకు కేటీఆర్ చేస్తున్న ప్రయత్నమేనన్న చర్చ జరుగుతున్నది. పైగా.. ఇటీవల పార్టీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ‘‘ఏ ధర్నా కార్యక్రమం చేపట్టినా ప్రజలు రావడం లేదు.. పార్టీ నాయకులే ఉంటున్నారు” అని బహిరంగంగా మాట్లాడారు. ఇలాంటి వాటినుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేసేందుకే కేటీఆర్, హరీశ్ రావు పదే పదే ‘‘ప్రజలు కేసీఆర్‌ను కోరుకుంటున్నారు..’’ అనే మైండ్ గేమ్‌కు తెరతీశారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.

జనం రావట్లేదని తేల్చేసిన బాల్క

కొనుగోలు కేంద్రాల దగ్గర వడ్లు అమ్ముకోడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారంటూ ఇటీవల బీఆర్ఎస్ కొన్ని ధర్నాలు, ప్రదర్శనలు చేసింది. ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. ఆ పార్టీ నాయకులు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులతో మాట్లాడారు. ఇదే సందర్భంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన కామెంట్ ఆ పార్టీలో అంతర్గత చర్చకు దారితీసింది. రైతులు, ప్రజలు రావట్లేదని, వంద మంది బీఆర్ఎస్ నాయకులంటే రైతులు ముగ్గురు నలుగురే ఉంటున్నారని, మిలిటెంట్ చర్యలు చేస్తేనే పార్టీకి మైలేజ్ వస్తుందని కామెంట్ చేశారు. ‘మిలిటెంట్ చర్యలు చేస్తేనే’ వంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. కానీ, పార్టీ ఎన్ని యాక్టివిటీస్ చేస్తున్నా జనం నమ్మడం లేదనే మెసేజ్ వెళ్లింది. ఒకవైపు కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరుగుతున్నదంటూ కేటీఆర్ కామెంట్లు చేస్తున్న సమయంలో బాల్క సుమన్ పార్టీ అంతర్గత సమావేశంలో వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.

కేడర్‌లో జోష్ నింపేందుకు తపన

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వరుసగా ఓటములు చవిచూస్తూ నిరాశలో ఉన్న బీఆర్ఎస్ కేడర్ లో జోష్ నింపేందుకే కేటీఆర్ కొత్త నేరేటివ్‌ను ముందుకు తెస్తున్నారనే చర్చ ఆ పార్టీలోనే కాకుండా ప్రత్యర్థి పార్టీల్లోనూ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో అంతకంటే ఘోరమైన ఫలితాలు రావడం బీఆర్ఎస్ కేడర్‌ను డీమోరల్ చేసింది. ఆ తర్వాత తొమ్మిది మంది ఎమ్మెల్యేలు దూరం కావడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పేలవమైన రిజల్ట్.. ఇవన్నీ పార్టీ వీక్ అవుతున్నదనే జనరల్ ఒపీనియన్ కేడర్‌లో ఎస్టాబ్లిష్ అయింది.

వీటన్నింటికీ మించి ‘‘అధికారమిస్తే సేవ చేస్తా.. లేదంటే ఫామ్ హౌస్‌లోనే పండుకుంటా..’ అంటూ గతంలో కేసీఆర్ కామెంట్ చేసినట్లుగానే రెండున్నరేండ్లుగా ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఇది కేడర్‌లో మరింత నిరాశకు దారితీసింది. నిజంగా ప్రజలకు కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరిగితే ఆల్టర్నేట్ బీఆర్ఎస్ అని చెప్తున్న కేటీఆర్.. ఫామ్ హౌస్ నుంచి ఆయనను బయటకు ఎందుకు రప్పించడంలేదు?… ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఫామ్‌ హౌస్‌లోనే ఎందుకు ఉండిపోతున్నారు..? వంటి ప్రశ్నలు బీఆర్ఎస్ కేడర్‌లోనూ నెలకొన్నాయి. వీటికి సమాధానాలు కరువయ్యాయి.

జనం కోరుకున్నట్లయితే.. ఎందుకు రావట్లేదు?

నిజంగా తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను కోరుకుంటున్నట్లయితే.. దాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ పసిగట్టినట్లయితే.. పార్టీ అధినేతగా ఆయన గుర్తించలేదా?.. గుర్తించినా ఎందుకు రోడ్డెక్కడంలేదు..? ప్రజలకు ఎందుకు భరోసా ఇవ్వడంలేదు..? ఇలాంటి ప్రశ్నలు గులాబీ కేడర్‌లోనే వినిపిస్తున్నాయి. ఇటీవల కేడర్‌లో ఉత్సాహం నింపడానికి, ‘సర్’పై అవగాహన కల్పించడానికి బీఆర్ఎస్ దాదాపు 80 సభలు నిర్వహిస్తే.. ఒక్కదానికి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కాలేదు. బావబామ్మర్దులు హరీశ్ రావు, కేటీఆర్ మాత్రమే పాల్గొన్నారు.

తమను ముందుకు నడిపించాల్సిన పార్టీ అధినేత బయటకు రాకపోవడంపై కార్యకర్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికారం ఉంటే మాత్రమే కేసీఆర్ కనిపిస్తారా?.. లేదంటే ఫామ్ హౌస్‌లోనే ఉండిపోతారా?.. ప్రతిపక్షంలో ఉంటే ప్రజలను పట్టించుకోరా?.. కేడర్‌లో మాత్రమే కాకుండా ప్రత్యర్థి పార్టీల నుంచి ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. కేవలం కేడర్‌లో ఉన్న నిరుత్సాహాన్ని పోగొట్టడానికి, వారిలో జోష్ నింపడానికే కేటీఆర్, హరీశ్‌ ‘‘కేసీఆర్ రావాలి.. ఆయన పాలన కావాలి” అంటూ జనం మధ్య నుంచి వ్యాఖ్యలు చేస్తున్నారే తప్ప కేసీఆర్ బయటకు వచ్చేది లేదని గులాబీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>