కలం, స్పోర్ట్స్ : టర్కీలోని అంటాల్యాలో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-3లో విజయవాడకు చెందిన ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర (Dhiraj Bommadevara) సరికొత్త చరిత్ర సృష్టించాడు. రెండు బంగారు పతకాలతో అతడు లిఖించిన చరిత్ర భారత ఆర్చరీలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికుతోంది. ఈ డబుల్ గోల్డ్ మెడల్ విజయం తర్వాత తన ఆలోచనలను పంచుకున్న ధీరజ్, ఈ ఘనత తన సుదీర్ఘ ప్రయాణానికి ఒక ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశాడు. రాబోయే ఆసియా క్రీడలతో పాటు లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు ప్రకటించాడు. మైదానంలోకి అడుగుపెట్టాక ప్రత్యర్థి ఎవరనేది తనకు ముఖ్యం కాదని, కేవలం తన ప్రదర్శనపైనే దృష్టి పెడతానని ఈ 24 ఏళ్ల స్టార్ ప్లేయర్ తెలిపాడు.
ఆర్చరీలో కొరియా జట్టుకు ఉన్న ఘన చరిత్రను చూసి భయపడాల్సిన అవసరం లేదని, ఆ స్థాయి పోటీలో నిలిచిన ప్రతి ఒక్కరూ అత్యుత్తమ ఆటగాళ్లేనని గుర్తుచేశాడు. తన విజయాల వెనుక సాంకేతిక మార్పులతో పాటు ‘రిఫ్లెక్షన్ డైరీ’ రాసే అలవాటు కూడా ఉందని, ఇది తనలో మానసిక స్పష్టతను, స్థిరత్వాన్ని పెంచి ఒత్తిడిని దూరం చేసిందని వివరించాడు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఏ ఒక్క బాణమో గెలుపును శాసించలేదని, ప్రతి షాట్ సమానంగా ముఖ్యమని ధీరజ్ పేర్కొన్నాడు. ఇదే టోర్నీలో మిక్స్‌డ్ టీమ్ విభాగంలో తన భాగస్వామి, టీనేజ్ సంచలనం కుంకుమ్ మోహోద్ ప్రదర్శనను అతడు ఎంతగానో అభినందించాడు.
ఒత్తిడిలోనూ ఆమె అద్భుతంగా పుంజుకుని పర్ఫెక్ట్ 10 పాయింట్లు సాధించిందని కొనియాడాడు. గత పారిస్ ఒలింపిక్స్‌లో తృటిలో చేజారిన పతకాన్ని, వచ్చే లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో ఖచ్చితంగా సాధిస్తామనే నమ్మకాన్ని వ్యక్తంచేశాడు. భవిష్యత్తులో రాణించాలనుకునే యువ అథ్లెట్లకు సలహా ఇస్తూ.. ప్రతిరోజూ ఒక విద్యార్థిలా కొత్త విషయాలు నేర్చుకోవాలని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం అత్యంత ముఖ్యమని ధీరజ్ హితవు పలికాడు.

