న్యూఢిల్లీ: మహిళా క్రికెటర్ల కోసం ‘రిటర్న్ టు ప్లే పోస్ట్ ప్రెగ్నెన్సీ గైడ్ లైన్స్’ పేరుతో ఐసీసీ కొత్త విధానాన్ని ప్రకటించింది. ఈ మార్గదర్శకాలు మహిళా క్రికెటర్లు (Women Cricketers) ప్రసవానంతరం తిరిగి సురక్షితంగా, స్థిరంగా క్రీడల్లోకి రావడానికి తోడ్పడనున్నాయి. ఇందులో ముఖ్యంగా ‘రెడీ, రివ్యూ, రీస్టోర్, రీకండిషన్, రిటర్న్, రిఫైన్’ అనే ఆరు దశల ఫ్రేమ్ వర్క్ ప్రవేశపెట్టారు. ప్రసవం తర్వాత ప్రారంభ కోలుకునే దశ నుంచి, 16 వారాల శిక్షణ, కండిషనింగ్ వరకు అన్ని అంశాలను సమగ్రంగా కవర్ చేశారు.
మార్గదర్శకాల్లో ఏముందంటే..?
కేస్ మేనేజర్: ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికి ప్రతి క్రీడాకారిణికి ఒక డాక్టర్ లేదా ఫిజియోథెరపిస్టును ‘కేస్ మేనేజర్’గా నియమిస్తారు.
మానసిక మద్దతు: క్రీడాకారిణి తల్లిగా మారిన తర్వాత కొత్త జీవితానికి అలవాటు పడేందుకు అవసరమైన మానసిక మద్దతును అందిస్తారు.
శిక్షణ: శిక్షణ విషయానికి వస్తే, క్రమ పద్ధతిలో బలం పెంచే వ్యాయామాలు చేయిస్తారు. ఎనిమిది వారాల తర్వాత, డాక్టర్ల పర్యవేక్షణలో రన్నింగ్ ను ప్రారంభిస్తారు.
పర్యవేక్షణ: కండరాలు, పెల్విక్ ఫ్లోర్ సమస్యల వంటి లక్షణాలను నిశితంగా పరిశీలించిన తర్వాతే క్రీడాకారిణిని తిరిగి మైదానంలోకి అనుమతిస్తారు.
పిల్లలు పుడితే కెరీర్ ముగిసినట్లు కాదు..
ఐసీసీ మెడికల్ అడ్వైజరీ కమిటీ సభ్యురాలు డాక్టర్ ఫిలిప్పా ఇంగే ఆధ్వర్యంలో రూపొందించిన ఈ గైడ్ లైన్స్ లో మరికొన్ని ముఖ్యమైన సిఫార్సులు కూడా ఉన్నాయి. ఇందులో శిశు సంరక్షణ సలహాలు, మైదానాల వద్ద పిల్లలకు పాలు పట్టడానికి లేదా సంరక్షించడానికి ప్రత్యేక వసతులు, ఫ్లెక్సిబుల్ శిక్షణ వాతావరణం, అవసరమైనప్పుడు ప్రయాణ సహకారం వంటివి ఉన్నాయి. పిల్లలు పుట్టినంత మాత్రాన కెరీర్ ముగిసినట్లు కాదని, ప్రతి దేశం తమ క్రీడాకారిణుల కోసం ఈ వాతావరణాన్ని కల్పించాలని ఆమె తెలిపారు.
పిల్లలను వదిలి రావడం కష్టమే
ఈ నిర్ణయంపై వెస్టిండీస్ క్రికెటర్ అఫీ ఫ్లెచర్ సంతోషం వ్యక్తం చేశారు. 2021లో తల్లి అయిన ఆమె తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. శారీరక కోలుకోవడం ఒక సవాలు అయితే, బిడ్డను వదిలి రావడం అంతకన్నా కష్టమని చెప్పారు. అయితే, ఐసీసీ తీసుకొచ్చిన ఈ కొత్త పాలసీ క్రీడాకారిణులు కుటుంబ జీవితాన్ని గడుపుతూనే, తిరిగి క్రికెట్ కెరీర్ను కొనసాగించడానికి ఎంతో ధైర్యాన్ని, అవకాశాన్ని ఇస్తుందని చెప్పారు.
ఆ పరిస్థితి రాకూడదు : ఐసీసీ ఛైర్మన్ జై షా
‘‘ఏ క్రీడాకారిణికీ మాతృత్వానికి, దేశం తరఫున ఆడటానికి మధ్య ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి రాకూడదు. మహిళా క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో, క్రీడాకారిణుల సంక్షేమాన్ని కాపాడటం, ప్రతిభావంతులైన ఆటగాళ్లను నిలుపుకోవడం చాలా ముఖ్యం. మహిళలు మైదానంలోనే కాకుండా వెలుపల కూడా రాణించేలా ఈ మార్గదర్శకాలు దోహదపడతాయి’’.

