Mobile Popup Ad
Mobile Popup Ad

ముంచుకొస్తున్న ముప్పు.. ‘పసిఫిక్’ గర్భంలో ‘గాడ్జిల్లా’ ఎల్ నినో

క‌లం, వాషింగ్టన్: ప్రపంచ దేశాలకు తీవ్రమైన వాతావరణ ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మునుపెన్నడూ చూడని తీవ్రమైన కరువు లేదా భయంకరమైన వరదలు వచ్చే అవకాశం ఉందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ప్రపంచ వాతావరణాన్ని స్థిరంగా ఉంచడంలో పసిఫిక్ మహా సముద్రం కీలకం. అలాంటి మహా సముద్రంలో మునుపెన్నడూ లేనివిధంగా అత్యంత శక్తిమంతమైన గాడ్జిల్లా ఎల్ నినో (Godzilla El Nino) ప్రభావం వేగంగా పెరుగుతున్నది. సముద్ర గర్భంలో ఈ ప్రమాదకర మార్పుకు కారణమవుతున్న భారీ ఉష్ణ తరంగాన్ని నాసా శాటిలైట్ తాజాగా ఫొటో తీసింది. ‘సెంటినెల్-6’ శాటిలైట్ పంపిన కొత్త వివరాల ప్రకారం.. పసిఫిక్ మహా సముద్ర పరివాహక ప్రాంతంలో సముద్ర మట్టాలు అసాధారణంగా పెరిగాయి. సముద్రం లోపలి పొరల్లో భారీ ఎత్తున వేడి నీరు చేరుతున్నదనడానికి ఇదొక స్పష్టమైన సంకేతమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

సముద్ర గర్భంలో వేడి నీటి నిల్వలు

సాధారణంగా సముద్రం పైన నీరు ఎంత వేడిగా ఉందో చూసి వాతావరణాన్ని అంచనా వేస్తుంటారు. కానీ, దానికంటే సముద్ర మట్టం ఎత్తు ఎంత పెరిగిందో చూస్తే.. సముద్రం లోపల ఎంత వేడి దాగి ఉందో కచ్చితంగా తెలుసుకోవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. ఎందుకంటే నీరు వేడెక్కినప్పుడు అది విస్తరించి పైకి లేస్తుంది. ఫలితంగా, సముద్ర మట్టాలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయంటే.. సముద్ర గర్భంలో భారీ ఎత్తున వేడి నీటి నిల్వలు పేరుకుపోయాయని అర్థం.

బలపడుతున్న ఎల్ నినో

చరిత్రలోనే అత్యంత బలమైన ఎల్ నినో సంభవించిన 1997 జూన్ నాటి పరిస్థితులే.. ఇప్పుడు పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో కనిపిస్తున్నాయని నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (జేపీఎల్) పరిశోధకులు స్పష్టం చేశారు. అప్పట్లో దీనికి ‘‘గాడ్జిల్లా ఎల్ నినో’’ (Godzilla El Nino) అని పేరు పెట్టారు. ఆ సమయంలో ఇది ప్రపంచవ్యాప్తంగా పలు ఖండాల్లో తీవ్రమైన వరదలు, కరువులు, పంట నష్టాలు, విపరీతమైన ఎండలకు కారణమైంది. ఇప్పుడు ఏర్పడుతున్న ఎల్ నినో మరింత బలపడుతున్నదని, ఇటీవలి దశాబ్దాల్లోనే ఇది అత్యంత కీలకమైన వాతావరణ పరిణామంగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నార్మల్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు

పసిఫిక్ మహాసముద్రంలో మధ్య, తూర్పు ప్రాంతాల్లో కొన్ని నెలలుగా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 11న అమెరికాకు చెందిన వాతావరణ సంస్థ నోవా అధికారికంగా ఎల్ నినో ముప్పును ప్రకటించింది. ఆ ప్రకటన వచ్చిన కొన్ని రోజులకే.. సముద్ర గర్భంలో భారీ ఎత్తున వేడి దాగి ఉందనే ఈ కొత్త ఆధారాలు శాటిలైట్ ద్వారా బయటపడ్డాయి.

సాధారణంగా కంటే పెరిగిన సముద్ర మట్టం

సముద్రంపై ఉండే వేడిని కొలవడంతో పాటు సముద్ర మట్టంలో వచ్చే చిన్న చిన్న మార్పులను కూడా సెంటినెల్-6 శాటిలైట్ గుర్తిస్తుంది. సముద్రపు నీరు వేడెక్కినప్పుడు అది పైకి లేస్తుంది. ఇలా పెరిగిన సముద్ర మట్టాలే లోపల దాగున్న వేడికి కచ్చితమైన ఆధారాలుగా పని చేస్తాయి. జూన్ 8న శాటిలైట్ పంపిన మ్యాప్‌ ప్రకారం.. పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాలు పెద్ద ఎత్తున ఎరుపు రంగులోకి మారిపోయాయి. అంటే అక్కడ సముద్ర మట్టాలు సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని, లోపల దాగున్న ఆ భారీ వేడి అంతా ఇప్పుడు అమెరికా వైపు (తూర్పుగా) వేగంగా విస్తరిస్తున్నదని స్పష్టం చేస్తున్నాయి.

వందల కిలో మీటర్ల వెడల్పు అలలు

సముద్ర గర్భంలో దాగున్న ఈ భారీ వేడి.. ‘కెల్విన్ తరంగాలు’ అని పిలిచే అంతర్గత నీటి అలల ద్వారా ప్రయాణిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వందల కిలోమీటర్ల వెడల్పు ఉండే ఈ అలలు ఎలా ఏర్పడతాయంటే.. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంపై వీచే గాలలు ఒక్కసారిగా బలహీనపడినప్పుడు లేదంటే వాటి దిశ మారినప్పుడు ఇవి పుడతాయి. దీంతో ఇండోనేషియా, ఆస్ట్రేలియా దేశాల వైపు ఉండాల్సిన వేడి నీరంతా.. మెల్లగా అమెరికా ఖండం వైపు (తూర్పుగా) కదలడం ప్రారంభిస్తుంది.

అడుగున ఉన్న వేడి నీళ్లే ప్రమాదకరం

ఇలా వేడి నీరు అమెరికా వైపు రావడంతో.. దక్షిణ అమెరికా తీరంలో సముద్రం అడుగున ఉండే చల్లటి నీరు పైకి రాకుండా ఆగిపోతాయి. దీంతో అక్కడ సముద్ర ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి. సరిగ్గా ఇదే ఎల్ నినో అసలైన లక్షణం. ‘‘సముద్రం పైన ఒక పల్చటి పొరలా ఉండే వేడి నీటి వల్ల పెద్దగా నష్టం ఉండదు. కానీ, సముద్రం లోపల కొండలా పేరుకుపోయిన ఈ భారీ వేడి నీరు.. ప్రపంచవ్యాప్త వాతావరణాన్ని మార్చేసి, ఒకచోట కరువును, మరోచోట భారీ వరదలను సృష్టిస్తుంది’’అని శాస్త్రవేత్తలు వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా కరువు, వరదల ముప్పు!

తూర్పు పసిఫిక్ మహాసముద్రం ఇంకా 1997 నాటి స్థాయిలో వేడెక్కనప్పటికీ.. సముద్ర గర్భం నుంచి మరికొన్ని వేడి కెల్విన్ తరంగాలు ఇప్పుడు ఆ ప్రాంతం వైపు వేగంగా దూసుకొస్తున్నాయి. దీన్ని బట్టి ఎల్ నినో ప్రభావం రోజురోజుకూ మరింత తీవ్రరూపం దాల్చుతున్నదని స్పష్టమవుతున్నది. ఇలా బలపడుతున్న ఎల్ నినో కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. ఎల్ నినో సంభవిస్తే అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతాయి. అదే టైమ్‌లో ఆస్ట్రేలియా, ఇండోనేషియాతో పాటు భారతదేశంలో కరువు ముప్పు ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>