కలం, వెబ్ డెస్క్: పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను బుధవారం తెలుగుదేశం పార్టీ (TDP) ప్రకటించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh)ని నియమించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ నియామకమయ్యారు. 29 మందితో పొలిట్ బ్యూరో ఏర్పాటు చేశారు. పొలిట్ బ్యూరోలో అనూహ్య మార్పులు చేస్తూ ప్రతి కమిటీలోను నూతనత్వం కనబడేలా ప్రకటన చేసింది. 31 మందితో జాతీయ కమిటీ ఏర్పాటు చేశారు. 185 మందితో రాష్ట్ర కమిటీని టీడీపీ ప్రకటించింది. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ముగ్గురికి అవకాశం కల్పించింది. జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందికి అవకాశం కల్పించింది. జాతీయ అధికార ప్రతినిధులు-10, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు-7, రాష్ట్ర ఉపాధ్యక్షులు-16, రాష్ట్ర అధికార ప్రతినిధులు-14, రాష్ట్ర జోనల్ కో-ఆర్డినేటర్ల-10, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు-59, రాష్ట్ర కార్యదర్శులు-77గా ప్రకటించింది. నాలెడ్జి కమిటీ, హెచ్ఆర్డీ కమిటీల్లో ఒక్కొరి చొప్పున నియామకం జరిగింది.
మండల పార్టీ అధ్యక్షురాలికి, క్లస్టర్ ఇన్ఛార్జికి పొలిట్ బ్యూరోలో చోటు
సీనియర్లకు గౌరవం, కొత్తవారికి అవకాశాలు, సామాజిక కోణం కోణంలో నూతన కమిటీల కూర్పు జరిగింది. విధేయత, కష్టపడే తత్వం, అనుభవం లెక్కించి పదవులు ఇచ్చినట్లు అధిష్టానం తెలిపింది. నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రాని వారికి పార్టీ పదవుల ద్వారా న్యాయం చేసింది. అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుని కమిటీల కూర్పుపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు కసరత్తు చేశారు. గతానికి భిన్నంగా పార్టీ కమిటీల కూర్పును కొత్త పుంతలు తొక్కించారు. గత కొంత కాలంగా చెబుతున్నట్టే పార్టీ బలోపేతానికి కష్టపడిన వారికి, విధేయులకు పెద్ద పీట వేశారు. ఓ మండల పార్టీ అధ్యక్షురాలికి, ఓ క్లస్టర్ ఇన్ఛార్జికి నేరుగా పొలిట్ బ్యూరోలో చోటు కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అత్యున్నత స్థాయి కమిటీ పొలిట్ బ్యూరోలో గజపతినగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తికొండ ధనుంజయ్ చోటు దక్కించుకున్నారు.
రాష్ట్ర కమిటీలో 50 మంది మహిళలకు చోటు
రాష్ట్ర కమిటీలోని 185 మందికి గానూ… 50 మంది మహిళలకు చోటు దక్కింది. పొలిట్ బ్యూరో, జాతీయ కమిటీల్లోనూ మహిళలకు సముచిత స్థానం కల్పించింది. జనాభా దామాషా పద్దతిన, సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు బేరీజు వేసుకుని కమిటీల కూర్పు జరిగింది. 185 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల్లో 122 మంది బడుగు బలహీన వర్గాలకు టీడీపీ అధిష్టానం స్థానం కల్పించింది. బీసీ-77, ఎస్సీ-25, ఎస్టీ-7, మైనార్టీ-13 మందికి చంద్రబాబు రాష్ట్ర కమిటీలో చోటు కల్పించారు. బీసీలకు 40 శాతం, ఎస్సీలకు 25 శాతం, ఎస్టీలకు 3.8 శాతం, మైనార్టీలకు 7 శాంత చొప్పున కమిటీలో పార్టీ అధినాయకత్వం స్థానం కల్పించింది. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని కోణాల్లో విశ్లేషించి సీఎం చంద్రబాబు కమిటీల కూర్పు చేపట్టారు. పార్టీకి యువ నాయకత్వం అందుబాటులోకి వచ్చేలా నియామకాలు చేశారు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ, 33 శాతం మహిళా రిజర్వేషన్లను దృష్టిలో పెట్టుకుని కసరత్తు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు పెద్ద పీట వేస్తూ కమిటీల కూర్పు జరిగింది.

