కలం, వెబ్ డెస్క్: అండమాన్ (Andaman) సముద్రంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. దక్షిణ బంగ్లాదేశ్‌లోని టేక్‌నాఫ్ తీరం నుంచి సుమారు 250 మంది ప్రయాణికులతో మలేసియాకు బయల్దేరిన ఓ పడవ సముద్రం మధ్యలో భారీ ఈదురుగాలులకు గురైంది. ఉవ్వెత్తున ఎగసిపడిన కెరటాల ఉద్ధృతికి గురై ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ పడవలో ప్రయాణిస్తున్న వారంతా రోహింగ్యా శరణార్థులు (Migrants), బంగ్లాదేశ్ పౌరులుగా గుర్తించారు. పడవ బోల్తా పడటంతో అందులోని వారందరూ సముద్రంలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. గల్లంతైన వారి ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

