కలం, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ ఏర్పాటై ఇవాళ్టి 44 ఏళ్ళు పూర్తి చేసుకున్నందున రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఘనంగా వేడుకలు (TDP Foundation Day) నిర్వహించనుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించనున్న వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu), మంత్రి లోకేశ్ సహా పలువులు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొంటారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు టీడీపీ పార్టీనుద్దేశించి ప్రసంగించనున్నారు. పార్టీకి 4 దశాబ్దాలుగా సేవలు అందించిన కార్యకర్తలకు చంద్రబాబు నివాసంలో విందును ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించి 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.
తెలుగు ప్రజలు ఐక్యత కోసం ఎన్టీఆర్ పిలుపుతో 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ తెలుగు వారి ఆకాంక్షలకు ప్రతిరూపమని పేర్కొన్నారు. పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వాలనే ఆయన సిద్ధాంతాన్ని సదా పాటిస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని.. ఆవిర్భావ దినోత్సవం అంటే మన ఇంటి పండుగ అని ఆయన గుర్తు చేశారు. ప్రతి కార్యకర్తకు సీఎం పేరుపేరునా శుభాకాంక్షలు తెలిపారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సవం (TDP Foundation Day) సందర్భంగా గ్రామగ్రామాన కార్యకర్తల ఇళ్లపై పసుపు జెండా ఎగర వేయాలని మంత్రి లోకేశ్ (Lokesh) పిలుపునిచ్చారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలపడానికి, బడుగుల చేతికి పాలనాధికారం ఇవ్వడానికి, నిరుపేదకు ఆనందంగా జీవించే హక్కును కలిగించడానికి 1982, మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారని లోకేశ్ గుర్తుచేశారు. 44 ఏళ్లుగా తెలుగు ప్రజల జీవన స్రవంతిలో భాగమైన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ పుట్టిందని పేర్కొన్నారు.
సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు అని నినదించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తితో టీడీపీ పేద ప్రజలకు అండగా నిలిచిందన్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాతే సమాజంలో అణగారిన, బడుగు, బలహీనవర్గాలకు రాజకీయంగా, సామాజికంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు. ప్రపంచంలో తెలుగువారిని నెం.1గా చేయడమే లక్ష్యంగా తమ పార్టీ ముందుకు సాగుతోందని చెప్పారు.
Read Also: ట్రంప్ పాలనపై భగ్గుమన్న అమెరికన్లు.. దేశ వ్యాప్తంగా భారీ నిరసనలు
Follow Us On : WhatsApp

