కలం, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్తో హరారేలో జరిగిన మూడో వన్డే సందర్భంగా జింబాబ్వే పేసర్ తనాకా చివాంగా (Tanaka Chivanga) ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు. దీంతో ఆయనకు ఐసీసీ అధికారిక హెచ్చరిక జారీ చేసింది. అలాగే ఆయన ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ కూడా నమోదు చేసింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సందర్భంగా సహచర ఆటగాడు ఇన్నోసెంట్ కైయా నుంచి తాను ఆశించినంత వేగంగా త్రో రాకపోవడంతో చివాంగా అసభ్య పదం ఉపయోగించినట్లు ఐసీసీ గుర్తించింది. ఇది ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్లోని లెవల్-1 నిబంధనల ఉల్లంఘనగా తేలింది.
చివాంగా తన తప్పును అంగీకరించి, మ్యాచ్ రిఫరీ డేవిడ్ గిల్బర్ట్ సూచించిన శిక్షను స్వీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేకుండా వ్యవహారం ముగిసింది. గత 24 నెలల్లో ఇది చివాంగాకు తొలి తప్పిదం కావడంతో ఒక డీమెరిట్ పాయింట్ మాత్రమే విధించారు. లెవల్-1 ఉల్లంఘనలకు అధికారిక హెచ్చరిక నుంచి మ్యాచ్ ఫీజులో 50 శాతం వరకు జరిమానా, అలాగే ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లు విధించే అవకాశం ఉంటుంది.

