వికసించని ఇందిరా సౌర గిరి జల వికాసం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : గిరిజన రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అట్టహాసంగా ప్రారంభించిన ఇందిరా సౌరగిరి జల వికాస (Indira Soura Giri Jala Vikasam) పథకం అటకెక్కిందని విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని గిరిజన రైతులకు సోలార్ పంపుసెట్లను అందించి ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు చేయూతనియాలనే పథకం నత్తనడకన కొనసాగుతోంది.

గిరిజన రైతులు సాగు చేస్తున్న పోడు భూములకు ఉచితంగా సాగునీటి వసతి కల్పించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించింది. అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు పొందిన గిరిజన రైతులకు ఎంతో ప్రయోజనం చేకూర్చే ఈ పథకం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ప్రారంభించారు.

ఈ పథకం (Indira Soura Giri Jala Vikasam) కింద అర్హులైన రైతులకు బోరు బావి, మోటారు, సోలార్ పంపు సెట్లను ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో ఉచితంగా అందిస్తుంది. ఒక్కో రైతుకు సుమారు రూ. 6 లక్షల విలువైన పరికరాలు, సేవలు ఉచితంగా అందుతాయి. ఇందులో బోరు వేయడం, విద్యుత్ మోటార్ బిగించడం, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం వంటివి ఉంటాయి.

కేవలం వరి వంటి పంటలే కాకుండా, పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించడానికి కూడా ఇందులో ప్రాధాన్యత ఇస్తారు. రాబోయే నాలుగేండ్లలో ఈ పథకం కోసం దాదాపు రూ. 12,600 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.1 లక్షల మంది గిరిజన రైతులకు, 6 లక్షల ఎకరాల పోడు భూములకు సాగునీరు అందించాలని లక్ష్యంగా ప్రభుత్వం
అడుగులు వేస్తుంది.

నల్లమల డిక్లరేషన్

ఈ పథకం ప్రారంభోత్సవ సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి నల్లమల డిక్లరేషన్ ను కూడా ప్రకటించారు. దీని ద్వారా గిరిజన గూడేలు, తండాల్లో మౌలిక వసతులు, విద్య, వైద్యం వంటి 12 కీలక అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని హామీ ఇచ్చారు. ఇటీవల ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కూడా ఈ పథకానికి నిధులు కేటాయించారు. తద్వారా పథకం అమలు వేగవంతం కానుంది.

ఇందిర సౌర గిరి జల వికాసం పథకం ద్వారా మొత్తం 2 లక్షల 10 వేల (2.1 లక్షల) మంది గిరిజన రైతులకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు పొందిన సుమారు 2.1 లక్షల నుండి 2.3 లక్షల మంది గిరిజన రైతులు ఈ పథకానికి అర్హులు. వీరికి సంబంధించిన 6 లక్షల ఎకరాల పోడు భూములకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.

అచ్చంపేట నియోజకవర్గంలోని అర్హులైన రైతులందరికీ 100 రోజుల్లో సోలార్ పంపులు అందిస్తామని ప్రారంభోత్సవంలో సీఎం హామీ ఇచ్చారు. ఇది ఐదేళ్ల ప్రాజెక్టు. మిగిలిన 2 లక్షల మందికి పైగా రైతులకు విడతల వారీగా ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతలో 10,000 మంది రైతులకు సుమారు 27,000 ఎకరాలకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఈ పథకం కోసం రూ. 12,600 కోట్లు కేటాయించింది. సోలార్ పంపులతో పాటు, బిందు సేద్యం పరికరాలను కూడా ఉచితంగా అందిస్తారు.

నాబార్డ్ నుండి రూ. 600 కోట్ల రుణం

గత ఏడాది మే లో ప్రారంభించిన ఈ పథకం ఇప్పుడు మొదటి దశ అమలులో ఉంది. పథకాన్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం నాబార్డ్ నుండి సుమారు రూ. 600 కోట్ల రుణం తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది . 2025-26 ఆర్థిక సంవత్సరంలో 10,000 మంది గిరిజన రైతులకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా పనులు ప్రారంభించింది.

పైలట్ ప్రాజెక్ట్ గా మాచారం

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం లోని మాచారం గ్రామాన్ని రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఇందిరా సౌర గిరి జలవికాసం పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రధానంగా 5 బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు ఉన్న గిరిజన రైతులను గుర్తించి, వారి భూములను పరిశీలించాలి.

గ్రూపుల ఏర్పాటు ..

2.5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు సింగిల్ యూనిట్ (వ్యక్తిగత బోరు) మంజూరు చేస్తారు. 2.5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులను కలిపి ‘బోర్ వెల్ యూజర్ గ్రూప్’ గా ఏర్పాటు చేసి, ఉమ్మడిగా బోరు వేయించాలి. భూగర్భ జల సర్వే ఎంపిక చేసిన భూముల్లో బోరు వేయడానికి నీటి లభ్యతను జియాలజిస్టుల ద్వారా పరిశీలించి బోరు వేస్తారు. రైతు పైసా ఖర్చు లేకుండా బోరు బావిని తవ్వించడం. దానికి సరిపడా మోటారు బిగించడం. విద్యుత్ సౌకర్యం లేని చోట సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయడం ఈ పథక ఉద్దేశం.

వచ్చే ఐదేళ్లలో మొత్తం రూ. 12,600 కోట్లు వెచ్చించి, 2.1 లక్షల మందికి ఈ పథకాన్ని అందించాలనీ ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుంది. ప్రస్తుతం నిధుల సమీకరణ, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగంగా జరుగుతోంది. రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలోని తండాల్లో దీని ప్రభావం కనిపించనుందని పరిశీలకులు భావిస్తున్నారు.

ఉద్దేశం మంచిదైనా.. చెడ్డ పేరు : కాట్రాజు పెద్దిరాజు, మాచారం మాజీ సర్పంచ్

పోడు భూములకు పట్టాలు కలిగిన రైతులందరికీ ఇందిరా సౌర గిరి జల వికాసం పేరిట 100శాతం సబ్సిడీతో రాష్ట్ర ప్రభుత్వం అందించిన బోరు మోటారులన్నింటిలో కొన్ని ప్రస్తుతానికి పనిచేయడం లేదు. మాచారం గ్రామంలో 50 మంది రైతులకు 31 బోరు మోటర్లు అందించారు. అందులో ఆరుగురి రైతులకు మోటార్లు బిగించినప్పటికీ బోరుబావిలో కూరుకుపోయి పనికిరాకుండా తయారయ్యాయి. ఈ విషయమై ఎనిమిది నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న ప్రయోజనం లేకుండా పోయింది. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇటీవల అమ్రాబాద్ పర్యటనలో జిల్లా కలెక్టర్ సహితం విజ్ఞప్తి చేశాం. ప్రభుత్వం ఉద్దేశం మంచిదైన కొందరు అధికారుల పుణ్యమా అంటూ చెడు పేరు మూటగట్టుకోవాల్సి వస్తుంది.

ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని కాంట్రాక్టర్ తాళం వేశాడు : లక్ష్మయ్య, లబ్దిదారుడు. మాచారం

ఇందిరా సౌర గిరిజల వికాస పథకం కింద బోర్లు మోటార్లు, మంజూరైన వాటికీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని సంబంధిత కాంట్రాక్టరు బోరు మోటార్ కు తాళం వేసి వెళ్లాడు. నాకున్న మూడు ఎకరాల పొలంలో వరి నాటేందుకు నారుమొడ్లు సిద్ధం చేసేందుకు సంకల్పించగా ఈ పరిస్థితి తలెత్తింది.

బోరు మోటర్లు ఊడిపడ్డాయి : లింగం, లబ్దిదారుడు. మాచారం

ఇందిరా సౌర జల వికాసం పథకంలో భాగంగా లబ్ధిదారులకు బోరు వేసి మోటార్లు బిగించినప్పటికీ బోరు మోటార్లు బోరుబావిలో పడిపోయాయి. వాటిని బయటికి తీయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. బోరు మోటర్లకు రబ్బర్ పైపులు బిగించడంతో అవి జారీ బోరుబావిలో పడిపోయాయి. అలా కాకుండా ఐరన్ పైపులు వేసి ఉంటే ప్రయోజనం ఉండేది. గ్రామంలో సుమారు 6 నుంచి 7మంది లబ్ధిదారుల పరిస్థితి ఇలాగే ఉంది. ఈ విషయమై అధికారులకు తెలిసినప్పటికీ ఎవ్వరూ స్పందించడం లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>