కలం, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ రాజధానిగా ప్రతిపాదించిన మావిగన్ (Mavigun)పై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం (Tammineni Sitaram) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం తమ్మినేని మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రతిపాదించిన ప్లాన్ బీ మావిగన్ అమలు చేయాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. మావిగన్ అమలు చేస్తే ప్రపంచంతో పోటీ పడొచ్చన్నారు. అధికారంలో ఉన్న నేతలు మావిగన్‌పై లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీగా తమ బాధ్యతగా రాజధానికి సూచనలు అందించామన్నారు. అమరావతికి ఖర్చు చేస్తామంటున్న నిధుల్లో 10 శాతం ఖర్చు చేసినా మావిగన్ అద్భుతంగా, నెంబర్ వన్ రాజధానిగా అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం చంద్రబాబు ఆమాత్రం కూడా ఆలోచించలేదా? అని ప్రశ్నించారు.
తిరుపతి లడ్డూలో పంది కొవ్వు కలిసిందని ఆరోపణలు సాగదీస్తూ రెండేళ్ల పరిపాలన సమయం వృధాగా గడిపారని తమ్మినేని విమర్శించారు. అందులో విషయం ఏదీ లేకపోవడంతో వదిలేశారన్నారు. రాష్ట్రంలో అప్పుల్లో ఉందని, రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి, దీనికి తోడు రాజధానికి అధిక ఖర్చు ఎందుకని ప్రశ్నించారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు అసలే అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రంపై రాజధాని పేరుతో మరింత భారం మోపుతున్నారని మండిపడ్డారు. ఇంకా ఎన్ని అప్పులు చేస్తారో కూడా తెలియదని పేర్కొన్నారు. అందుకే రాష్ట్రంలోని ప్రజలు, మేధావులు, విద్యా వంతులు, పాత్రికేయులు, విద్యార్థులు అందరూ ఏకగ్రీవంగా మావిగన్‌ను రాజధానిగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.

