కలం, స్పోర్ట్స్: ఇండియాతో బంగ్లాదేశ్ సిరీస్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. సిరీస్ రద్దు కాలేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ (Tamim Iqbal) తెలిపారు. కొత్త తేదీ కోసం రెండు బోర్డులు చర్చలు జరుపుతున్నాయని చెప్పారు. ఇండియా, బంగ్లాదేశ్ మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు జరగాల్సి ఉంది. ఆగస్టు-సెప్టెంబర్‌లో ఈ సిరీస్ జరగాల్సి ఉంది. అయితే భారత్ సెప్టెంబర్ 13 నుంచి అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. దీంతో ముందుగా అనుకున్న సమయంలో బంగ్లాదేశ్ పర్యటన జరగడం లేదు.
అయితే సిరీస్‌ను రద్దు చేసినట్లు నిర్ణయం తీసుకోలేదని తమీమ్ స్పష్టం చేశారు. రెండు బోర్డులు కొత్త తేదీ కోసం నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని తెలిపారు. ఇక 2026 టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడంపైనా తమీమ్ స్పందించారు. ఆ వ్యవహారాన్ని మరింత మెరుగ్గా చర్చించి పరిష్కరించాల్సిందని అన్నారు. ముస్తాఫిజుర్ రహ్మాన్ విషయంలో జరిగిన పరిణామం సరైనది కాదని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రపంచకప్ ఆడాల్సిన సమయంలో పరిస్థితిని మరింత జాగ్రత్తగా నిర్వహించాల్సిందని అభిప్రాయపడ్డారు.
చర్చల్లో జరిగిన కొన్ని విషయాలను బయటపెట్టలేనని తమీమ్ తెలిపారు. క్రీడలను ఇతర వివాదాల నుంచి సాధ్యమైనంత వరకు వేరుగా చూడాలని అన్నారు. బంగ్లాదేశ్ ప్రపంచకప్‌లో తప్పకుండా ఆడాల్సిందని, చర్చలను కూడా మెరుగైన రీతిలో నిర్వహించాల్సిందని తమీమ్ మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇండియా-బంగ్లాదేశ్ సిరీస్‌కు కొత్త తేదీ ఖరారు కాలేదు. రెండు బోర్డుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.

