కలం, నారాయణపేట: నారాయణపేట జిల్లా నుంచి జాతీయ స్థాయి క్రీడాకారులు, రాష్ట్ర స్థాయి ఛాంపియన్లు ఉండటం ఎంతో సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ (Narayanpet Collector) ప్రియాంక (Priyanka)అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ, నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘బేటీ బచావో–బేటీ పడావో’ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కళాశాలల కౌమార దశ బాలికలకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలకు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా క్రీడల అభివృద్ధి శాఖ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ ప్రియాంక ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే పట్టుదలతో క్రీడాకారులు ముందుకు సాగడం అభినందనీయమన్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు, పీఈటీలు, ఉపాధ్యాయులు, డీవైఎస్ఓ, డీడబ్ల్యూఓతో పాటు క్రీడా విభాగం సిబ్బందిని అభినందించారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నారాయణపేట జిల్లాలో క్రీడల అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించినట్లు తెలిపారు.
జిల్లాలోని స్టేడియాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన నిధులను సమీకరించి, మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు జిల్లా యంత్రాంగం పూర్తి అండగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి వారికి విద్యతో పాటు క్రీడల్లోనూ అవకాశాలు కల్పించాలని అధికారులకు సూచించారు. అవసరమైన అదనపు సిబ్బంది, ఇతర సహకారాన్ని జిల్లా యంత్రాంగం తరఫున అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

