కలం, నకిరేకల్: సెప్టెంబర్ 5న నకిరేకల్ (Nakrekal)లో నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను జయప్రదం చేసేందుకు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాథగొని కొండయ్య పిలుపునిచ్చారు. సభ నిర్వహణ, జన సమీకరణపై గురువారం మండల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు గాథగొని కొండయ్యతో పాటు పీసీసీ డెలిగేట్ ఏసుపాదం, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వర్ రావు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనతో నకిరేకల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మరింత వేగవంతమవుతాయని పేర్కొన్నారు.
స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు నియోజకవర్గ ప్రజలందరూ సంపూర్ణ మద్దతుగా నిలవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక సర్పంచులు విరార్జున్ రెడ్డి, నకిరేకంటి నరేందర్, స్వప్న, కృష్ణవేణి, వెంకట చారి, యాదగిరి రెడ్డి, జన్రెడ్డి, యల్లేష్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

