స‌మ్మె చేస్తున్న త‌మిళ‌ సినిమా నిర్మాత‌లు.. ఎందుకంటే?

క‌లం, వెబ్‌డెస్క్‌: సినీ న‌టులు, సాంకేతిక నిపుణుల భారీ పారితోషికాల వ‌ల్ల తాము ఎదుర్కొంటున్న ఆర్థిక స‌మ‌స్య‌ల‌కు నిర‌స‌న‌గా త‌మిళ సినీ నిర్మాత‌లు (Tamil Producers) నేడు ఒక్క‌రోజు స‌మ్మెకు దిగారు. ఈ సంద‌ర్భంగా త‌మిళ సినీ నిర్మాత‌ల మండ‌లి స‌మావేశంలో నిర్మాత‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌త మూడేళ్ల నుంచి ఇండ‌స్ట్రీలో స్టార్ల రెమ్యున‌రేష‌న్లు విప‌రీతంగా పెరిగిన‌ట్లు తెలిపారు. దీంతో చాలామంది నిర్మాత‌లు భారీ న‌ష్టాల్లో కూరుకుపోయార‌ని, కొత్త సినిమాలు నిర్మించ‌లేక ఇబ్బందులు ప‌డుతున్నార‌ని చెప్పారు. ఈ స‌మ‌స్య‌పై న‌డిగ‌ర్ సంఘంతో చ‌ర్చ‌లు జ‌రిపినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో నిర్మాత‌లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడిని ప్ర‌పంచానికి చాటిచెప్పేందుకే ఈ నిర‌స‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు.

నిర్మాత‌ల‌కు ఆర్థిక భారాన్ని త‌గ్గించేందుకు రెవెన్యూ షేర్ ప‌ద్ధ‌తిని అమ‌లు చేయాల‌ని నిర్మాతల మండ‌లి ప్ర‌తిపాదిస్తోంది. న‌టీన‌టులు ముందుగానే భారీ మొత్తంలో ఫిక్స్‌డ్ పేమెంట్స్ డిమాండ్ చేయ‌కుండా, సినిమా విడుద‌ల‌య్యాక వ‌చ్చే లాభాల్లో వాటా తీసుకోవాల‌ని కోరుతోంది. బాలీవుడ్‌లో అమీర్‌ఖాన్‌, స‌ల్మాన్ ఖాన్‌, షారూక్ ఖాన్ వంటి అగ్ర హీరోల‌తో స‌హా టాలీవుడ్‌లో ప‌లువురు స్టార్లు ఇదే విధానం అనుస‌రిస్తున్నార‌ని సూచిస్తోంది. ఈ ప‌ద్ధ‌తితో నిర్మాణ వ్య‌యం త‌గ్గి సినిమా హిట్ కాక‌పోయినా నిర్మాత రోడ్డున ప‌డే ప‌రిస్థితి ఉండ‌ద‌ని వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు. నిర్మాత‌ల స‌మ్మె ప్ర‌భావంతో శ‌నివారం త‌మిళ‌నాడు వ్యాప్తంగా షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తిగా నిలిచిపోయాయి. ప‌లు సినీ కార్మిక సంఘాలు ఈ స‌మ్మెకు పూర్తి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. ఇప్ప‌టికైనా సినీ తార‌లు త‌మ‌తో చ‌ర్చ‌ల‌కు రావాల‌ని నిర్మాత‌లు కోరుతున్నారు. ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న‌తోనే త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ భ‌విష్య‌త్తు బాగుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>